రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ లో రద్దయిన 26 పథకాలను వెంటనే అమలు చెయ్యాలని కోరుతూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరసన దీక్ష ప్రారంభిచారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ నేతృత్వంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, గుజరాత్ ఎమ్మెల్యే శంభునాథ్ తుండియా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా ఇంఛార్జ్ బిట్ర శివన్నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు దీక్షలో పాల్గోన్నారు.
రూ.32 వేల కోట్లను అనుచరులకు దోచిపెట్టారు !
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 32 వేల కోట్ల నిధులను ఏపీ సీఎం జగన్ తన అనుచరులకు దోచిపెట్టారని ఆరోపించారు. దళితుల కార్పొరేషన్ లో వారికి ఎటువంటి నిధులు లేకుండా చేసి, ఎస్సీలను రోడ్డు మీద వదిలేశారన్నారు. సీఎం జగన్ వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఆశపెట్టి.. వారికి రావాల్సిన నిధులను దోచుకున్నారని ఆరోపించారు. దళితులకు ద్రోహం చేసిన వారు మంత్రులగా పనికి రారు. వారిని నిరుద్యోగులను చేసింది వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు.
దళిత కార్పొరేషన్ లో దళితులకు రద్దు చేసిన పథకాలను తిరిగి అమలు చెయ్యాలని బీజేపీ ఎస్సీ ప్రధాన కార్యదర్శి, గుజరాత్ ఎమ్మెల్యే శంభునాథ్ తుండియా కోరారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ 48 గంటల నిరసన దీక్ష చేపట్టిందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల నిధులను దుర్వినియోగం చెయ్యడమే కాకుండా వారిని చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వటం చాలా దారుణం అన్నారు. వైసీపీ చేసే ఎన్నో అరాచకాలను సహించాం, కాని దళితులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. చివరికి వారి భుములు కూడా లాక్కొని అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం, ఎస్సీలను విద్యకు కూడా దూరం చేస్తూ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలను ఎత్తి చూపిస్తాం, ఎందుకు ఈ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపిస్తుంది వారికి ప్రజలను హింసించడంలో ఆనందం పొందుతున్నారని అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన 26 పథకాలు ఎస్సీ ఎందుకు రద్దు చేసారు అని ప్రశ్నించారు, వాటిని వెంటనే ఆంధ్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా వింతలు చూస్తున్నామని, ఆయనకు నచ్చినట్లు ప్రజలను ఆడుకుంటున్నారని తెలిపారు. తన ఇంట్లో సొమ్ము ప్రజలకు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాడని, రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలను హింసిస్తున్నాడని ఆరోపించారు.
కేంద్రం ఇస్తున్న సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించే హక్కు మీకెవరు ఇచ్చారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో బ్రిటీష్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నట్లు అనిపిస్తుందన్నారు. నవరత్నాల పేరుతో నిధులను పంచుతూ ఓట్లు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. రాష్ర్టంలో మంత్రుల ప్రవర్తన తలదించుకునేల ఉందని మండిపడ్డారు. తన యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతలా దిగజారిన పోలీసు వ్యవస్థను చూడలేదని, పేదల సొమ్ముతో బతుకుతున్నారంటూ మండిపడ్డారు. అమ్మ ఒడి పేరుతో ఏ విధంగా 26 పథకాలను తొలగిస్తారని ఏపీ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు దళితుల సొమ్ము తింటారు, జగన్ నీతిమాలిన చట్టాలు ఇక ఈ రాష్ట్రంలో చెల్లవని హెచ్చరించారు.