Sabitha Indra Reddy: నూతన సంవత్సరం సందర్భంగా తనను కలవడానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు, శాలువాలు తీసుకురావద్దని తెలంగాన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఇలాంటి వాటికి బదులుగా ఏవైనా ఉపయోగపడే పనులు, ముఖ్యంగా ప్రజలకు పనికొచ్చేవి చేస్తే బాగుంటుందన్నారు. బొకేలు, శాలువాలకు బదులుగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడీ పిల్లలకు మ్యాట్లు, చిన్న వాటర్ బాటిల్స్ వంటివి అందించాలని కోరారు. ఇలాంటివి చేయడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తనను కలవడానికి మాత్రమే వచ్చినప్పుడు కాకుండా ఇతర ఇతర నేతలు, అధికారులను కలవడానికి వెళ్లేటప్పుడు కూడా తీసుకెళ్లొద్దని చెప్పారు. ఇలాంటి వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకెళ్లడం, వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 


వచ్చే ఏడాది 2023 సందర్భంగా అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేయాలని కోరారు. నూతన సంవత్సరంతో పాటుగా జన్మదినాల సందర్భంగా ఇలాంటి హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలకనున్నారు. నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సబితా కోరారు. 


కేక్ కటింగ్ కు బదులుగా గిఫ్ట్ ఏ స్మైల్


మంత్రి కేటీఆర్ కూడా గతంలో ఇలాంటి వాటికి బదులుగా పనికొచ్చేవి చేయాలని తన అభిమానులను, పార్టీ శ్రేణులను కోరారు. ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు సదంర్బంగా పలు కామెంట్లు చేశారు. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలనిమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ పుట్టిన రోజు జూలై 24వ తేదీ ఆదివారం. ఇందు కోసం పార్టీ నేతలు భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. అయితే వరదల కారణంగా ఈ సారి సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వాటిని కొనసాగిస్తారు. అలాగే వరద బాధిత ప్రాంతాల్లో కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్యాడర్ బాధితులకు సహాయ చర్యలు చేపట్టనుంది. ప్రతీ ఏడాది కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నేతలు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద.. అంబులెన్స్‌లు.. వికలాంగులకు ట్రై స్కూటర్లు వంటివి పంపిణీ చేసేవారు. ఈ సారి కూడా ఆ కార్యక్రమాలు జరగనున్నాయి.