Amarnadh On Pawan :   పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ నాయకుల మాటల దాడి కొనసాగుతోంది. జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు 15వ తేదీన పవన్ కల్యాణ్ విశాఖ పట్నం వెళ్లనున్నారు. అయితే అదే రోజు వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన నిర్వహిస్తోంది.  తమ కార్యక్రమానికి పోటీగా పవన్ కల్యాణ్ వస్తున్నారని అనుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ మంత్రి అమర్నాథ్ పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు పేకలో జోకర్ అని అని మండిపడ్డారు. జనవాణి కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ వాయిదా వేసుకోవాలన్నారు. లేకపోతే ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  ఉత్తరాంధ్రపై మీ వైఖరి చెప్పాల్సిందేనని ప్రజల దృష్టిని మళ్లించడానికే పవన్‌ పర్యటన అని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. 


పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్న గుడివాడ అమర్నాథ్ 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్ఆర్‌సీపీ తీరుపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వశాఖలో వైఎస్ఆర్‌సీపీ చేపట్టాలనుకున్న విశాఖ గర్జన ఎందుకని ప్రశ్నిస్తూ.. ఎందుకీ గర్జన పేరుతో దాదాపుగా పాతిక ప్రశ్నలు సంధించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు పవన్ కల్యాణ్... చంద్రబాబు కోసమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శించారు కానీ..సమాధానాల పరంగా స్పందించలేదు. అయితే పవన్ కల్యాణ్.. ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమాన్ని తమ గర్జన ర్యాలీ తర్వాతి రోజే పెట్టుకోవడం.. గర్జన రోజే ఆయన విశాఖ రావాలని నిర్ణయించుకోవడంతో.. తమ కార్యక్రమాన్ని ఆటంకపరచడానికేనని వైఎస్ఆర్‌సీపీ నేతలు భావిస్తున్నారు. 


జనవాణిలో పవన్ ను నిలదీస్తామన్న గుడివాడ అమర్నాథ్ 


పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు వస్తే ఆయన అభిమానులు, జనసేన నేతలు పెద్ద ఎత్తున హంగామా చేసే అవకాశం ఉంది. విశాఖ సిటీలో జనసేనకు మంచి క్యాడర్ ఉంది. ముగ్గురు కార్పొరేటర్లు కూడా గెలిచారు. పవన్ కల్యాణ్ ఇలా విశాఖ వస్తే గర్జనను డామినేట్ చేసే అవకాశం ఉందని అందుకే ఆయన రావొద్దని.. పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జనవాణిలో ఆయనను ప్రజలు నిలదీస్తారని ఆయన  హెచ్చరిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ జనవాణిని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, రాజమండ్రి, తిరుపతిల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక విశాఖే మిగిలింది. అక్కడ కూడా నిర్వహించాలని తేదీ ఖరారు చేసుకోవడం.. అది విశాఖలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న గర్జనతో క్లాష్ కావడంతో టెన్షన్ ప్రారంభమయింది. 


ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ విమర్శలు - వ్యక్తిగతంగా మంత్రుల విమర్శలు


పవన్ కల్యాణ్‌్పై గుడివాడ అమర్నాథ్ ఇటీవలి కాలంలో  ఘాటు విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయనపై జనసైనికులు కూడా సోషల్ మీడియాలో అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏదైనా ప్రశ్నిస్తే ప్రతీ సారి వ్యక్తిగతంగా.. విమర్శలు చేస్తున్నారని ..  కానీ పాలసీల పరంగా మాట్లాడటం లేదని జనసేన నేతలు మండి పడుతున్నారు. 


తెలంగాణ అెధికారులకు చివరి చాన్స్ - లేకపోతే జైలు శిక్ష ఖాయం ! సుప్రీంకోర్టు ఫైనల్ వార్నింగ్