Andhra Pradesh News: విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అన్నారు. వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లాల డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు (TDP Chief Chandrababu)కు తెలుసునని, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు 2019 మినహా మిగతా అన్ని ఎన్నికల్లోను వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, ఆయనకు పొత్తులు కొత్త కాదన్నారు. 


దేశమంతా ఎన్నికలకు సిద్ధం, పొత్తుల కోసం చంద్రబాబు సిద్ధం 
ఎన్నికల సంగ్రామానికి రాష్ట్రాలు, దేశం సిద్ధమవుతుంటే.. చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం ఎక్కే గడప దిగే గడప అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు మేము సిద్ధం అని సీఎం జగన్ ధైర్యంగా చెబుతుంటే, చంద్రబాబు మాత్రం కేంద్ర మంత్రి అమిత్ షా ఇంటిదగ్గర తాను సిద్ధం అని చెప్పుకుంటున్నాడని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యనించారు. జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని గతంలో విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వారితో పెట్టుకున్న పొత్తుపై ప్రజలకు ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. 
‘బీజేపీకి, వైసిపికి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబు నిరంతరం తప్పుపడుతూ వచ్చారు. బీజేపీ, వైసీపీకి ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలే ఉన్నాయి తప్ప, వ్యక్తిగత సంబంధాలు లేవని జగన్ ప్రజల సాక్షిగా, ప్రధాని మోదీకి చెప్పిన విషయం చంద్రబాబుకు గుర్తులేదా?. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  అంశాన్ని తమ మీద నెట్టేయాలని చంద్రబాబు చూశాడని, ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాల మీద చంద్రబాబు ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పగలరా?. కాంగ్రెస్ పార్టీతో సంబంధం పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు బిజెపితోను, ప్రాంతీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవడాన్ని చూస్తే ఆయనలో ఓటమి భయం స్పష్టమవుతుందని’ మంత్రి అమర్నాథ్ అన్నారు.  


ఢిల్లీ పెద్దలను ఎదిరించిన ఎన్టీఆర్
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ ఆనాడు ఢిల్లీ పెద్దలను ఎదిరిస్తే, నేడు చంద్రబాబు వాళ్ళ ముందు మోకరిల్లడం ప్రజలు హర్షించరని అమర్నాథ్ అన్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చిన వైసీపీదే అంతిమ విజయమని ఆయన స్పష్టం చేశారు. తమ కూటమి సీఎం అభ్యర్థి చంద్రబాబు అని లోకేష్ ఇప్పటికే ప్రకటించారని, అప్పుడు పవన్ కళ్యాణ్ కు అక్కడ పవర్ ఏముంటుందని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు.  ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి గురించి మాత్రమే జగన్ ఆలోచిస్తున్నారని.. పొత్తుల గురించి ఆలోచన లేదన్నారు. తాము ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని, పార్టీలతో పొత్తు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.


రాష్ట్రంలో కాపులు వైసీపీకి మద్దతు ఇస్తారా అనే విషయంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గత ఎన్నికల్లో 175 సీట్లలో 31 సీట్లను కాపులకు ఇచ్చామన్నారు. వారిలో 29 మంది గెలిచారని, చాలామందికి జగన్ పదవులు ఇచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కాపు సంక్షేమానికి 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. మరే పార్టీ కాపులకు ఇంత ప్రయోజనం చేయలేదన్నారు. 


అంబటి రాంబాబు ట్వీట్
CM CM అని అరిసిన ఓ కాపులారా! 
CM అంటే చీఫ్ మినిస్టరా?
CM అంటే సెంట్రల్ మినిస్టరా?
CM అంటే చంద్రబాబు మనిషా?
CM అంటే చీటింగ్ మనిషా ? అని అంబటి రాంబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.