AP Elections 2024 Gajuwaka: గాజువాక: అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకలో వైఎస్సార్ సీపీని గెలిపించి సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఇద్దామన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath). రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి స్థానిక టీ.ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. గడచిన 15 సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులు అన్ని కలిసి పని చేస్తే వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు. ప్రత్యేక పరిస్థితులు, రాజకీయ సమీకరణాల కారణంగా పార్టీ అధినేత జగన్ తనకు ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించారని అమర్నాథ్ వెల్లడించారు. 


అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటా - గుడివాడ అమర్నాథ్ 
వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని, ఆయన గెలుపు కోసం అవసరమైతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని పార్టీ అధినేతలకు చెప్పినట్లు అమర్నాథ్ వెల్లడించారు. తన మీద నమ్మకం ఉంచి జగన్ తనను గాజువాక అభ్యర్థిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి సమక్షంలోనే తొలి సమావేశం ఏర్పాటు చేయాలని తాను అభ్యర్థన మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పదేళ్లుగా నాగిరెడ్డిని చూస్తున్నానని, ఆయన మనస్తత్వం తనకు బాగా తెలుసునన్నారు. గుడివాడ, తిప్పల కుటుంబాలకు 3 తరాల రాజకీయ అనుభవం ఉందన్నారు. తన తాత గుడివాడ అప్పన్న గెలుపు కోసం తిప్పల కుటుంబం ఏ విధంగా శ్రమించిందో తనకు తెలుసునన్నారు మంత్రి అమర్నాథ్. 


పవన్ కళ్యాణ్ పై నాగిరెడ్డి పోటీ చేసినప్పుడు మింది నుంచి మంచి మెజార్టీ తీసుకువచ్చి నాగిరెడ్డి విజయానికి సహకరించామని తెలిపారు. తనను నమ్ముకున్న వారికి వీలైనంతవరకు మంచి చేస్తామన్నారు. "గడిచిన 5 సంవత్సరాలలో అనకాపల్లిలో పార్టీ క్యాడర్ తో ఏ విధంగా పని చేశానో తెలుసుకోవాలి. వైసీపీ కోసం పనిచేసిన వారిని అనేక పదవుల్లో కూర్చోబెట్టానని’ 
అమర్నాథ్ చెప్పారు.


అమర్నాథ్ ను సీఎం వైఎస్ జగన్ నేరుగా గాజువాక అభ్యర్థిగా నియమించారని మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. వైసీపీ జెండా పట్టుకుని పనిచేసే కార్యకర్తలను అమర్నాథ్ ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారికి నేను చేస్తారని గురుమూర్తి రెడ్డి చెప్పారు. వర్గ విభేదాలు మాని నాగిరెడ్డి నాయకత్వంలో అమర్నాథ్కు బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకువద్దామని చెప్పారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అమర్నాథ్ అని, ఆయనను గెలిపించుకుంటే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు.


ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి విజయం కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పేదవాడికి న్యాయం జరగాలంటే వైసిపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని, సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పార్టీ విజయం కోసమే పని చేయాలని, నాగిరెడ్డి సూచించారని దేవన్ రెడ్డి చెప్పారు. గాజువాక నియోజకవర్గం లో అమర్నాథ్ ఈజీగా నెగ్గుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.