Teachers Washed Away in Stream: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నదులకు చేరుతుంది. ఉన్నట్లుండి వాగులు పొంగిపొర్లుతున్నాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఒట్టెగెడ్డ వాగు ప్రవాహంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కొట్టుకుపోయారు.  ఏకలవ్య పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆర్తితో పాటు హాస్టల్ వార్డెన్ మహేశ్ ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో ఒక్కసారిగా ఒట్టిగెడ్డ వాగు పొంగి పొర్లడంతో బైక్‌తో పాటు ఇద్దరూ నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. అయితే కొంతదూరం వెళ్ళిన తర్వాత మహేష్‌కు ఆసరాగా ఒక చెట్టు దొరికింది, కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆర్తి అనే టీచర్ కొట్టకుపోయింది. స్థానికులతోపాటు పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గల్లంతు ఘటన పై మంత్రి సంధ్యారాణి స్పందించారు. తక్షణమే వాగులో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. ఉపాధ్యాయురాలు ఆర్తి కోసం గ్రామస్థులు, స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 


 ఏపీకి పొంచి ఉన్న ముప్పు 
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


​ఉత్తరాంధ్రలో భారీ వర్షం
ఏపీకి వాతావరణ శాఖ మరో రెండురోజులపాటు వర్ష సూచన ఇచ్చింది. శుక్ర,శనివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇకపోతే ఇవాళ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజులలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం కురిశాయి.  ఇకపోతే విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


​రాయలసీమలో మోస్తరు వర్షం​
 ఇక రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.   


కోస్తాంధ్రలో తేలికపాటి వర్షం
 అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాదు డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.