One member commission Adulterated ghee:  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అంశంలో సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక విషయంలో  ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికను పరిశీలించి  సమగ్ర విచారణ జరిపేందుకు  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సేకరణ, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను ఈ కమిషన్ ప్రధానంగా పరిశీలించనుంది.

ఎవరీ దినేష్ కుమార్? 

దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1983 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి . ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.  పరిపాలనలో అపారమైన అనుభవం గడించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో పౌర సరఫరాలు, ఆహార శాఖ వంటి కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. నిజాయితీ గల అధికారిగా గుర్తింపు పొందిన దినేష్ కుమార్, పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వం అప్పగించే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

కమిషన్ విధులు ఇవే.. 

ఈ ఏకసభ్య కమిషన్ ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు సంబంధించి సిట్  రిపోర్ట్‌లో ఉన్న లోపాలను విశ్లేషించనుంది. 2019 నుండి 2024 మధ్య కాలంలో నెయ్యి నాణ్యత విషయంలో నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? టెండర్ నిబంధనలను ఎవరి కోసం మార్చారు? అనే కోణంలో విచారణ జరగనుంది. అలాగే,  బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఎలా దక్కాయి ..  ఇందులో అధికారుల పాత్ర ఎంత అనే దానిపై లోతైన అధ్యయనం చేయనుంది. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. 

నివేదిక అందిన తర్వాత సూత్రధారులపై చర్యలు   కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే కాకుండా, ఈ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను  గుర్తించడం ఈ కమిషన్  ప్రధాన లక్ష్యం. లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సిఫారసులను దినేష్ కుమార్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది. సిట్ ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా, మరింత లోతుగా విచారణ జరిపి నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.           

కమిటీ నియామకం చట్టబద్ధమేనా? 

 ఒకే అంశంపై  సిట్  విచారణ జరుగుతున్నప్పుడు, మళ్ళీ సమాంతరంగా మరొక విచారణ కమిషన్ నియమించడం చట్ట విరుద్ధమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.  చట్టపరంగా ప్రభుత్వానికి ఏవైనా ప్రత్యేక అవకతవకలు లేదా పరిపాలనాపరమైన లోపాలపై విచారణ జరిపించేందుకు కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్, 1952 ప్రకారం కమిటీలను నియమించే అధికారం ఉంటుంది. సిట్ అనేది కేవలం క్రిమినల్ కోణంలో దర్యాప్తు చేస్తే, ఈ ఏకసభ్య కమిషన్ విధానపరమైన నిర్ణయాలు, టెండర్ల నిబంధనల ఉల్లంఘన వంటి వ్యవస్థాగత లోపాలపై దృష్టి సారిస్తుంది. కాబట్టి, వీటి పరిధులు వేర్వేరుగా ఉన్నంత వరకు ఈ నియామకం చట్టబద్ధమే అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  కోర్టులో దీనిపై సవాల్ చేస్తే అది తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది.