Panneerselvam meets Stalin: తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం (OPS) , ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.    తమిళనాడు శాసనసభ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ప్రత్యేకంగా కలిశారు.  ఏఐఏడీఎంకే  లో చోటు చేసుకున్న అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్, తన సొంత వర్గంతో రాజకీయంగా ఒంటరయ్యారు. ఈ క్రమంలో అధికార పక్ష నేతను ఆయన కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  

Continues below advertisement

అసెంబ్లీలో ఓపీఎస్ మద్దతుదారుడు ఐయ్యప్పన్ ఆసక్తికర వ్యాఖ్యలు 

తమిళనాడు శాసనసభలో రెండ్రోజుల పాటు జరిగిన తాత్కాలిక బడ్జెట్ చర్చల సందర్భంగా ఓపీఎస్ మద్దతుదారుడు, ఎమ్మెల్యే ఐయ్యప్పన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ము.క. స్టాలిన్ మళ్లీ విజయం సాధించి, తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా, పురట్చి తలైవర్ ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మ  జయలలిత  ఆశీస్సులతో స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది.   

Continues below advertisement

 

 మళ్లీ డీఎంకే పాలనే.. ఓపీఎస్ ధీమా 

శాసనసభ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్, అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఎంకే ఐదేళ్ల పాలన అత్యంత అద్భుతంగా ఉందని కొనియాడారు. అందుకే ఉదయాన్నే ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన విశ్లేషించారు. తన మద్దతుదారు ఐయ్యప్పన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ప్రజల మనోగతానికి ప్రతిరూపమని ఓపీఎస్ సమర్థించారు.

 డీఎంకేలో చేరికపై వేచి చూడండి 

మీరు డీఎంకేలో చేరుతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఓపీఎస్ స్పందిస్తూ..  కొంతకాలం వేచి చూడండి అని బదులిచ్చారు. ఈ సమాధానం ఆయన పార్టీ మారబోతున్నారనే అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన ఓపీఎస్.. 'ధర్మయుద్ధం' చేసినా, 'హక్కుల పునరుద్ధరణ కమిటీ' పెట్టి పోరాడినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఆయన ప్రధాన అనుచరులంతా ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరిపోగా, ఇప్పుడు ఆయన వద్ద మిగిలింది కేవలం ఎమ్మెల్యే ఐయ్యప్పన్ మాత్రమే.  ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఓపీఎస్ డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారా అనే సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన స్పష్టత అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.