Girl Request For Photo With CM Chandrababu: విజయవాడ (Vijayawada) శివారులోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్‌లో శనివారం సాయంత్రం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక జనంలో నుంచి లేచి సీఎం చంద్రబాబుకు చేతులెత్తి అభివాదం చేస్తూ ఫోటో కావాలని అడిగింది. ఈ క్రమంలో ఆయన ఆమెను వేదికపై పిలిచి ఫోటో దిగారు. కాసేపు మాట్లాడి చదువు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 






'అది దేశానికే గర్వకారణం'




ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే అది ఆయన ఒక్కరికే కాదని దేశానికి, తెలుగు జాతి మొత్తానికీ గౌరవమని సీఎం చంద్రబాబు అన్నారు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. యుగ పురుషుడు పుడితే చరిత్ర ఎలా మరిచిపోదో, దానికి నిదర్శనం దివంగత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆవిష్కరించారు. 'చరిత్ర ఉన్నంతవరకు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి, తెలుగింటి ఆత్మ గౌరవం, ప్రపంచ వ్యాప్తంగా అదే గుర్తింపు కలిగిన మహా శక్తి ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం కేవలం ఎన్టీఆర్‌కు సాద్యమైంది. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన చోట సువర్ణాధ్యాయం. ఎన్టీఆర్ నటించిన మన దేశం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. చరిత్రను చూసి స్ఫూర్తిగా తీసుకోవాలి. పల్లెటూర్లో, రైతు కుటుంబంలో నిమ్మకూరులో వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మే 25 జన్మించిన యుగ పురుషుడు ఎన్టీఆర్. చదువు కోసం విజయవాడకు వచ్చానని నాకు చెప్పారు. పాలు అమ్మి తరువాత గుంటూరుకు వెళ్లి చదువుకున్న వ్యక్తి. 


సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్. 300 సినిమాల్లో నటించారు. ఆయన ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేశారు. ఇప్పుడు ఒక్క సినిమాకు మూడేళ్లు పడుతుంది. భారత సినీ చరిత్రలో ఇన్ని సినిమాలు, ఇన్ని విభిన్న పాత్రలు చేసింది ఎన్టీఆర్. వెంకటేశ్వరస్వామి, రాముడు, కృష్ణుడు పాత్రలు అంటే ఆయనే. మనం దేవుడ్ని చూడలేదు. కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడ్ని చూస్తున్నాం.' అని అన్నారు.


Also Read: Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!