Navaratri Brahmotsavam 2023: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.
విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా లక్ష్మీ కాసుల మాలను ఈవో ధర్మారెడ్డి దంపతులు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా వాహన మండపం వద్దకు తీసుకొచ్చి శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరించారు. మాఢ వీధులు నిండిన తరువాత నాలుగు మూలల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఇన్నర్ రింగ్ రోడ్‌లో వేచి ఉన్న భక్తులకు గరుడ వాహన దర్శన భాగ్యం కల్పించారు. తద్వారా ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.
గరుడ వాహనం, సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటి నమ్మకం.
గ్యాలరీల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
తిరుమలలో గురువారం గరుడసేవ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలు, ఇతర సౌకర్యాలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. గ్యాలరీల్లోని భక్తులతో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అన్న ప్రసాదాలు, తాగునీరు నిరంతరాయంగా అందజేస్తున్నందుకు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీవారి సేవకులకు ప్రశంసలు
నాలుగు మాఢ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజాము నుంచి అంకితభావంతో, భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 2,500 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదాల ప్యాకింగ్, గ్యాలరీల్లో అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయడాన్ని అభినందించారు.
గరుడ వాహనసేవలో కళాబృందాల కోలాహలం
గరుడ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అరుదైన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 21 కళాబృందాల్లో 497 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు శ్రీనివాస కళ్యాణాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి, స్వామివారి భక్తులైన గరుత్మంతుడు, తాళ్లపాక అన్నమయ్య వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు.
బెంగళూరు, విద్యారణ్యపురి నృత్యోదయ అకాడమీకి చెందిన దివ్యశ్రీ బృందం ఉత్సవసంకీర్తనల నాట్యవిన్యాసం భక్తులను సమ్మోహితులను చేసింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన తోగల్ జోగల్ కళలో భాగవత లీలలను తెలిపే మధురమైన ఘట్టాలను మనోహరంగా ప్రదర్శించారు.
కేరళ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన ఓనంను ఆటపాటలతో అలరించారు. అలాగే కేరళకు చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన కథాకళిని చంద్రశేఖర్ బృందం అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన సంబల్ పురి అనే కళారూపాన్ని ప్రతిభా రాణి బృందం సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన నెమలిపించాలతో కూడిన భరతనాట్యం నయన మనోహరంగా ప్రదర్శించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బండి గుడుంభజ అనే వాద్యకళను లోక్పాల్ దూవే ఆధ్వర్యంలో కడు విన్యాసాలతోప్రదర్శించారు. గుజరాత్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ జానపద కళారూపమైన గూమర్ ను పి.రాజి బృందం చక్కగా ప్రదర్శించి భక్తులను అలరించారు.