నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
గాజువాకనుంచి వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి..
ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి దూరమవుతున్నారు. అధికార పార్టీకి వీరంతా దూరమవడం ఒక విశేషం అయితే, వీరందరూ సీఎం జగన్ సొంత సామాజిక వర్గం నేతలు కావడం మరో విశేషం. అసలు సొంత సామాజిక వర్గం నేతలు జగన్ కి ఎందుకు దూరమవుతున్నారు. ఆయనపై వారికి ఎందుకంత కోపం..?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్ట్ లన్నీ రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారని ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసింది. అధికారుల్లో కూడా ఆ సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని కూడా అన్నారు. సాక్ష్యాధారాలకోసం కొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు, మరోవైపు అదే సామాజిక వర్గం సీఎం జగన్ కి దూరమవడం విశేషం.
నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాకుండా మిగిలిన ఎనిమిది చోట్ల ఏడుగురు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలున్నారు. ఆ ఏడుగురులో ముగ్గురు ఏకంగా పార్టీనుంచి బయటకు వచ్చారు. ఒకే జిల్లాలో తమ సామాజిక వర్గం బలం చూపించిన ఆ ముగ్గురు ఇప్పుడు టీడీపీవైపు వచ్చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. వైసీపీని వీడటం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పట్లో పార్టీ దూరం పెట్టిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గ నేతలే.
ఆళ్లకు ఇబ్బంది ఏంటి..?
మంత్రి వర్గంలో సమన్యాయం కోసం సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం చేశారని కొంతమంది పార్టీ నేతలంటున్నారు. మంగళగిరిలో లోకేష్ ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి సామాజిక వర్గమే అడ్డంకిగా మారింది. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసులరెడ్డికి రెండోసారి మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా సామాజిక వర్గమే. ఇలా అదే సామాజిక వర్గం నేతలు చాలామంది సీఎం జగన్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ వారంతా తమకు న్యాయం జరగడంలేదని ఇప్పుడు బాధపడుతున్నారు.
ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు రాజీనామాలతో జగన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ ఇలాంటి ఒత్తిడులకు లొంగుతారని అనుకోలేం. మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లను కాదని గంజి చిరంజీవికి ఆయన టికెట్ ఇవ్వాలనుకున్నారు. ఆ టికెట్ బీసీ అయిన చిరంజీవికి ఇస్తే, ఆళ్ల పార్టీలో ఉండరని జగన్ కి తెలుసు. అయినా అక్కడ తప్పడంలేదు. దీంతో ఆళ్ల జగన్ కి దూరమయ్యారు. గాజువాకలో తిప్పల దేవన్ రెడ్డికి కూడా ఈసారి టికెట్ ఖాయం కాకపోవచ్చు. అందుకే ఆయన వైసీపీ నుంచి బయటకొచ్చారు. మరికొందరు నేతలు కూడా ఇదే బాట పడతారనే అనుమానాలున్నాయి. ఎన్నికల నాటికి ఎంతమంది ఇలా జగన్ పై అలిగి బయటకొస్తారు, వారిలో ఎంతమందిని వైరి వర్గం ఆదరిస్తుందనేది వేచి చూడాలి.