ఒకప్పుడు దిగ్గజ జట్లకు ముచ్చెమటలు పట్టించిన వెస్టిండీస్‌.. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌నకు కూడా అర్హత సాధించలేకపోయింది. అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, జింబాబ్వే వంటి జట్ల చేతుల్లోనూ పరాజయం పాలై.. క్రమక్రమంగా విండీస్ జట్టు ప్రభ మసక బారి ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. విండీస్‌లో ఇప్పటికీ స్టార్‌ ఆటగాళ్లు లేక కాదు. ఉన్నా వారు జాతీయ జట్టు కంటే లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం ఉంది. గతేడాది ఐపీఎల్ వేలంలో నికోలస్ పూరన్ రూ.16 కోట్లకు అమ్ముడుపోయాడు. ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ 20 లీగ్‌లు.. విండీస్‌ క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వెస్టిండీస్ క్రికెట్‌ బోర్టు ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని స్థితిలో ఉండడంతో కరేబియన్‌ క్రికెటర్లు లీగ్‌ బాట పట్టాల్సి వచ్చింది. మరోసారి ఇదే నిజమైంది. మరోసారి దేశానికి ఆడడం కంటే లీగ్‌లు అంటేనే తమకు ఎక్కువ ఇష్టమని తేల్చేశారు.


వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్లు నికోలస్‌ పూరన్‌, జేసన్‌ హోల్డర్‌, కైల్‌ మేయర్స్‌ తమకు కాంట్రాక్టులు అవసరం లేదని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపారు. వెస్టిండీస్ క్రికెట్‌ బోర్డు ఇచ్చిన కాంట్రాక్టులను వీరు తిరస్కరించారు. కాకపోతే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌నకు మాత్రం అందుబాటులో ఉంటామని బోర్డుకు స్పష్టం చేశారు. డిసెంబర్‌ 10న క్రికెట్‌ వెస్టిండీస్‌ సెంట్రల్‌ కాంట్రాక్టులను ప్రకటించింది. పురుషుల క్రికెట్‌లో 14 మంది, మహిళల క్రికెట్లో 15 మందికి కాంట్రాక్టులను అందజేసింది. ఈ కాంట్రాక్టులను తిరస్కరించిన వారిలో హోల్డర్‌, పూరన్‌ గతంలో వెస్టిండీస్‌ కెప్టెన్‌లుగా కూడా పని చేశారు. మూడు ఫార్మాట్లలో ఆడే మేయర్స్‌ పరిమిత ఓవర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. లీగ్‌ క్రికెట్‌లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఈ క్రికెటర్లు.. దేశం తరఫున టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటామని చెప్పడంపై వెస్టిండీస్‌ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. 


భారత అగ్రశ్రేణి స్టార్లు సంవత్సరానికి సుమారు రూ. 7 కోట్లు సంపాదిస్తే, వెస్టిండీస్ క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్ట్‌ల ద్వారా కేవలం రూ. 1.2 కోట్లు మాత్రమే పొందుతున్నారు. క్రికెట్‌ను ప్రేమగా ఆడే రోజులు పోయాయి. ఎందుకంటే ప్రేమతో మీరు కిరాణ సరుకులు కూడా కొనలేరు" అని విండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామీ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌ బోర్డు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2014లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి, ఆటగాళ్లకు మధ్య జరిగిన వాగ్వాదం, మేనేజ్‌మెంట్‌తో చెల్లింపు వివాదం.. ఈ వివాదంతో భారత పర్యటనను విండీస్‌ జట్టు అర్ధాంతరంగా విడిచిపెట్టిపోవడం వంటి ఘటనలు కూడా కరేబియన్‌ జట్టును పతనం దిశగా నడిపించాయి. 2012, 2016లో రెండు టీ 20 ప్రపంచ కప్ టైటిళ్లను విండీస్‌ గెలుచుకున్నా.. అది ఆ ఫార్మాట్‌కే పరిమితమైపోయింది. అదే ఊపును కరేబియన్‌ జట్టు వన్డేల్లో కొనసాగించలేక పోయింది. గత ఏడాది నుంచి మూడు ఫార్మట్లలోనూ విండీస్‌ పూర్తిగా పాతాళానికి పడిపోయింది. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌ కప్‌లో విండీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించి ఆ దేశ క్రికెట్‌ ప్రేమికులను విషాదంలో ముంచేసింది. ఇంతకుముందు వెస్టిండీస్ ఓటమి చాలా బాధించేది.. కానీ ఇప్పుడు అది మాకు అలవాటైందని ఆ దేశ దిగ్గజ ఆటగాడు గార్డాన్ గ్రీనిడ్జ్ వ్యాఖ్యానించడం కరేబియన్‌ జట్టు పతనం ఎలా సాగుతుందో చెప్పేందుకు నిదర్శనం.