Four Years Child Achieving World Record in Nandigama: 4 నెలల చిన్నారి అంటే ఊహ కూడా తెలిసుండదు. అప్పుడప్పుడే బుడి బుడి అడుగులతో అమ్మఒడిలో కేరింతలు కొడుతూ సేద తీరుతుంటుంది. కానీ, ఓ చిన్నారి అద్భుతం సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 120 వస్తువులను ఫోటోలు చూపిస్తే గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మాటలు కూడా సరిగా రాని ఈ చిన్నారి ప్రతిభకు ప్రపంచ రికార్డు దక్కింది. దీంతో పాప తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.


ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రమేష్, హేమ దంపతుల కుమార్తె కైవల్యకు 4 నెలలు. ఈ వయస్సులోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువులు, పువ్వుల ఫోటోలను గుర్తుపట్టగలుగుతోంది. 3 నెలల వయసులోనే పాపకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను చూపించానని.. వాటిని గుర్తు పట్టడం చూసి నాలుగో నెల నుంచి కలర్ ఫోటోస్ చూపిస్తే పాప అన్ని వస్తువులను గుర్తించిందని చిన్నారి తల్లి హేమ తెలిపారు. ఫోటోలను మనం చేత్తో పట్టుకుని చూపిస్తే పాప వాటిని గుర్తు పడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. దీన్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపగా వారు తిరస్కరించారని అన్నారు. తమ పాప టాలెంట్ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కు అప్లై చేయడంతో వారు పాప వీడియో పంపాలని సూచించారు. దీంతో పాప గుర్తు పట్టే బొమ్మల వీడియోలను వారికి పంపామని.. వారం రోజుల వ్యవధిలోనే వారు చిన్నారి కైవల్య ప్రతిభ గుర్తించి వరల్డ్ రికార్డ్స్ కు ఎంపికైనట్లు చెప్పారని తెలిపారు. 2 రోజుల క్రితం దీనికి సంబంధించిన సర్టిఫికెట్, పతకం తమకు అందాయని వివరించారు. తమ పాపకు ఇంతటి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.



Also Read: Chandrababu: 'రాప్తాడు అడుగుతోంది, వీటికి సమాధానం చెప్పు' - సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్