AP Voters List : ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలపై మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టు లో   (Supreme Court) పిటిషన్ వేశారు. సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ అనే సంస్థను స్థాపించిన  నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్నారు. తాజాగా ఆయన ఓటర్ల జాబితా అక్రమాలపై న్యాయపోరాటం ప్రారంభించారు.   నిమ్మగడ్డ దాఖలు చేసిన  పిటిషన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ గవాయి ధర్మాసనం ముందుకు వచ్చింది. కానీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నాట్ బిఫోర్ అన్నారు.    గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of AP High Court) పని చేసినందున ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు.  సీజేఐ (CJI) ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు.                                    
 
ఏపీలో ఓటర్ల జాబితాలన్న పూర్తిగా వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా రెడీ అవుతున్నాయని వీరంతా వైసీపీ కార్యకర్తలేనని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే  ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించారని.. దీనిపై ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోందని...  ఐప్యాక్ మాజీ ఉద్యోగులతో దొంగ ఓట్లు భారీగా చేరుస్తున్నారంటూ   నిమ్మగడ్డ రమేశ్  పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీలో ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకించిన డేటాను ప్రొఫైలింగ్ చేస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.68 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని నిమ్మగడ్డ తెలిపారు.                


ఐప్యాక్ మాజీ ఉద్యోగులు చేస్తున్న ఈ వ్యవహారం మొత్తాన్ని పిటిషన్‌లో ఉటంకించారు. ఓటర్ల నమోదులోగ్రామ, వార్డు వలంటీర్లను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయడంపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీజేఐ ఆదేశాలతో పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. పిటిషన్ ఎప్పటికి విచారణకు  వస్తుందో తేలాల్సి ఉంది.  గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు తన స్వగ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే..  అధికారులు ఇవ్వడానికి నిరాకరించారు.  హైకోర్టుకు వెళ్లి పోరాటం చేశారు. చివరికి తన ఓటును నమోదు చేయించుకున్నాయి. తాజా ఓటర్ జాబితాలో ఆయన పేరు ఉంది. 


ఏపీలో ఓటర్ జాబితాలో అక్రమాలపై విపక్షాలు తీవ్రమై న ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్ జాబితాలో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున చేర్చారని.. ఎంతో మంది ఓట్లు అక్రమంగా తీసేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని పది వేల ఓట్ల వరకూ గల్లంతు చేస్తున్నారన ఈ ధైర్యంతోనే వైనాట్ 175 అంటున్నారని  టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు ఓటర్ జాబితాలో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టాలని హైకోర్టు కూడా ఆదేశిచింది. హైకోర్టు ఆదేశాలతో పర్చూరులో కొంత మందిపై కేసులు పెట్టారు.