Motkupalli Narasimhulu: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన ఏపీ సీఎంపై, జగన్ ప్రభుత్వ పాలనపై విమర్శనస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇటీవల కాస్త సైలెంట్ అయిన మోత్కుపల్లి.. మళ్లీ ఇప్పుడు జగన్‌పై తన వాయిస్ పెంచారు. శనివారం ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించిన మోత్కుపల్లి.. ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.


ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే కారణంతో జగన్‌కు ప్రజలు అవకాశం కల్పించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌కు మైకం కమ్ముందని ఆరోపించారు. వైసీపీ గెలుపు కోసం పనిచేసిన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను జగన్ బయటకు గెంటేశారని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఎన్నికల ముందు జైల్లో పెట్టి కక్ష తీర్చుకుంటున్నారని, జగన్‌కు ఆయనంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న చంద్రబాబును జైలుకు పంపి రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. వయస్సులో జగన్ చాలా చిన్నవాడని, చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడిని అరెస్ట్ చేయించడం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.


జగన్ ఈ నాలుగేళ్లల్లో అసలు ఏం చేశాడని, ఏం అభివృద్ది చేశారని మోత్కుపల్లి ప్రశ్నించారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని, ఎన్నికలకు ముందు ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. కేవలం రూ.370 కోట్లకు చంద్రబాబు ఎలా ఆశపడతారని, ఆయన వయస్సుకు గౌరవం ఇచ్చైనా వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్‌తో జీహెచ్ఎంపీ పరిధిలో బీఆర్ఎస్‌కు నష్టం జరగబోతుందని, గ్రేటర్ పరిధిలో 30 సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముందని, ఆ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని మోత్కుపల్లి సూచించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టే పార్టీ కాంగ్రెస్సేనని, తనకు తుంగతుర్తి నుంచి సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, కానీ తనను మాత్రం పిలవడం లేదని తెలిపారు. కేసీఆర్‌ దళితులకు దళితబంధు ఇస్తానని చెప్పడం వల్ల తాను ఆ పార్టీలో చేరానని, కానీ పథకం అమలు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ను నమ్మి తాను మోసపోయానన్నారు. దళితబంధు అమలు కాకపోతే తాను గడ్డి మందు తాగి చనిపోతానని గతంలో చెప్పానని, ఆ మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.


కాగా  బీఆర్ఎస్‌లో మోత్కుపల్లికి ప్రాధాన్యత దక్కడం లేదు. ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా బయటకొచ్చిన ఆయన.. కేసీఆర్, జగన్‌ను టార్గెట్ చేస్తూ వస్తోన్నారు.