Rains In Telangana: ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత రెండు రోజులుగా కొన్ని చోట్ల చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చిరు జల్లులు కురవనున్నాయి. కొన్ని చోట్ల మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జనవరి 13 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో కొన్నిచోట్ల చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక్కడ సైతం మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కళింగపట్నంలో 17.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నందిగామలో 18.5 డిగ్రీలు, బాపట్లలో 18.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 18.8 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 19 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీలోని రాయలసీమలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. జనవరి 14 వరకు వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్యవరంలో కనిష్టంగా 18 డిగ్రీలు, అనంతపురంలో 19 డిగ్రీలు, నంద్యాలలో 20.8 డిగ్రీలు, కర్నూలులో 20.7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్ష సూచన ఉన్నప్పటికీ వాతావరణ కేంద్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాళపల్లి, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
Also Read: ఈ నాలుగు రాశుల వారు ఈ రోజు ఏం చేసినా సక్సెస్ అవుతారు, మీరున్నారా అందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..