Vijayawada: దేశంలో రేపు  78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలకించుతారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘హర్ గర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా విజయవాడలోని సితార సెంటర్ లేబర్ కాలనీలో భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. 3303 అడుగుల మువ్వన్నెల జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.  సితార సెంటర్ మీదుగా సొరంగం, చిట్టినగర్ కూడలి, కేఎబీఎన్ కాలేజీ మీదుగా పంజా సెంటర్ వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. అంతకుముందు ఎంపీ కేశినేని చిన్ని ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు.  




ర్యాలీని ముందుకు నడిపిన ఎంపీ
దేశ ప్రజల్లో జాతీయ సమైక్యత, జాతీయ భావం, దేశభ‌క్తి పెంపొందేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హ‌ర్ ఘ‌ర్ తిరంగ్ కార్యక్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కేశినేని చిన్ని కోరారు. డూండీ గ‌ణేష్ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో  3,303 అడుగుల భారీ తిరంగా జెండా ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిధిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ తో పాటు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి పాల్గొన్నారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్ లో విద్యార్ధుల ప‌ట్టుకున్న భారీ త్రివర్ణ పతాకాన్ని పరిశీలించారు.  అనంత‌రం ర్యాలీ ముందు జాతీయ జెండా చేత‌బూని ర్యాలీని ముందుకు నడిపించారు.


అమరవీరుల సూర్ఫి 
పంజా సెంట‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన స‌భ‌లో ఎంపి కేశినేని శివ‌నాథ్(చిన్ని) మాట్లాడారు. భారతదేశ పార్లమెంటు సభ్యుడిగా మీ అందరితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కులా మ‌తాల‌కు అతీతంగా ఉండే ప‌శ్చిమ నియోజ‌వ‌క‌ర్గంలో దేశ స‌మైక్య‌త‌ను పెంచే విధంగా జ‌రిగిన ఈ ర్యాలీ స్వాతంత్యోద్య‌మంలో ప్రాణాలు ఆర్పించిన వీరుల స్పూర్తిని నేటి త‌రానికి అందించిందని అన్నారు.



2022లో హ‌ర్ ఘ‌ర్ తిరంగ్ ప్రారంభం
2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపుతో ప్రతి ఇంట జాతీయ జెండా రెపరెపలాడుతుందని... నేటి తరం లో జాతీయభావం బాగా పెరిగిందన్నారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, స్వాతంత్య్రోద్యమ చరిత్ర ఈ తరానికి చాటి చెబుతుందన్నారు. 
  
 కృష్ణా జిల్లా ముద్ద బిడ్డ పింగళి వెంకయ్య
 దేశ ప్రజలు గర్వపడేలా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య ఉమ్మడి కృష్ణజిల్లా ముద్దు బిడ్డ కావటం మనకు ఎంతో గర్వకారణమ‌న్నారు.. నాడు పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతదేశానికి ఒక ప్రతీకగా నిలిచిందన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా ప్రకటించింది విజయవాడలోనే అని గుర్తు చేశారు ఎంపీ చిన్ని .. దాంతో పాటు ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధుల్లో ఉత్సాహ‌న్ని నింపారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ విద్యా సంస్థ‌లు, కాలేజీల నుంచి త‌ర‌లివ‌చ్చిన‌ వేలాది మంది విద్యార్ధులు 3,303 అడుగుల భారీ తిరంగా జెండాను చేత‌బూని వందేమాతరం అంటూ ముందుకు నడిచారు.