YS Jagan Travel In Economy Class: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సతీమణి భారతితో కలిసి సాధారణ ప్రయాణికుడిలా కూర్చున్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇన్నాళ్లు బిజినెస్ క్లాస్‌లో, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన జగన్.. ఇప్పుడు సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్న ఫోటో ఎప్పటిదా అని నెటిజన్లు ఆరా తీసున్నారు. అయితే ఈ ఫొటో బెంగళూరు ప్రయాణం సందర్భంగా అయ్యుంటుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
ఈ ఫొటోతో టీడీపీ, వైసీపీ మధ్య ఎక్స్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బిజినెస్ క్లాస్ , స్పెషల్ ఫ్లైట్‌లు పట్టుకుని తిరిగి అధికారం చేజారాక సాధారణ ప్రయాణికుడిలా వెళ్తున్నారు అంటూ టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. కిలోమీటర్ దూరం కూడా లేని వాటికి కూడా హెలికాప్టర్లు వాడి ఇప్పుడు ఈ బిల్డప్ ఏంటని నిలదీస్తున్నారు. ఇదంతా సానుభూతి కోసం చేస్తున్న ట్రిక్ అంటూ సైటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వాటికి కాలం చెల్లిందని అంటున్నారు.
టీడీపీ విమర్శలకు వైసీపీ దీటుగానే బదులిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సొంత డబ్బులతో తిరుగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. సచివాలయం నుంచి ఉండవల్లిలో ఇంటికి 9 కిలో మీటర్లకు కూడా హెలిక్యాప్టర్ వాడుతున్నారా లేదా.. గన్నవరం నుంచి ఇంటికి 30 కిలోమీటర్లకు ఎప్పుడైనా కారులో వచ్చారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 2019-24 మధ్య ఆయనెప్పుడైనా 9 కిలో మీటర్ల హెలిక్యాప్టర్‌లో వచ్చారా అని అడుగుతున్నారు. గతంలోనూ 2014-19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే హెలిక్యాప్టర్‌ను సైకిల్ వాడినట్టు వాడేశారని వైసీపీ వారు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉండగా ఏనాడూ కాలు నేల మీద మోపలేదని గట్టిగానే బదులిస్తున్నారు.
ఈ ఫొటో విషయంలో టీడీపీకి తోడు జనసేన కార్యకర్తలు సైతం జత కలిసి వైసీపీని విమర్శిస్తున్నారు. ఈ ఫొటో చుట్టూ మాత్రం ఎక్స్ వేదికగా ఏపీలోని ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. కొందరు టీడీపీ వారైతే ఫొటోను వైరల్ చేసి కామెంట్లు చేసి జగన్‌కి ఎలివేషన్లు ఇవ్వద్దని తమ వారికి హితవు పలుకుతున్నారు. మీరంతా ప్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి ఎవరూ తక్కువ కాదన్నట్టు న్యూట్రల్‌గా ఉండే నెటిజన్లు నోరెళ్లబెట్టి నిట్టూరుస్తున్నారు. అయితే నిన్నటి నుంచి వైరల్ అవుతున్న ఈ ఫొటో ఎప్పటిది అనేది పక్కా సమాచారం మాత్రం లేదు. ఈ మధ్య తరచూ బెంగళూరుకి వెళ్లి వస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరో ఒక ప్రయాణికుడు ఫొటో తీసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది.