Ali Vs Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమని సినీ నటుడు, వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు అలీ ప్రకటించారు. అయితే జగన్ ఆదేశించాలని అని అన్నారు. పార్టీ ఆదేశిస్తే ఒక్క పవన్ పైనే కాదని.. ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధమనిప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ 175కి 175 సీట్లు గెలుస్తుందని ప్రకటించారు. పవన్ కల్యాణ్ తనకు మిత్రుడే అయినా.. రాజకీయం వేరు.. ఫ్రెండ్ షిప్ వేరని అలీ చెప్పుకొచ్చారు.
వైసీపీలో చేరిన తర్వాత పవన్ పై ఘాటు విమర్శలు చేసిన అలీ
రాజకీయాలపై ఆసక్తితో గత ఎన్నికలకు ముందు ఏదో ఓ పార్టీలో చేరి పోటీ చేయాలనుకున్న అలీ తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీతో పాటు జనసేన పార్టీతోనూ సంప్రదింపులు జరిపారు. పవన్ కల్యాణ్ .. అలీ మంచి మిత్రులు కావడంతో జనసేనలో చేరుతారని ఎక్కువ మంది అనుకున్నారు. కానీ అలీ మాత్రం అనూహ్యంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేయడం వివాదాస్పదమయింది. రాజకీయ విమర్శలు దాటి వైఎస్ఆర్సీపీ మార్క్ విమర్శలు చేయడంతో పవన్ కు.. అలీ మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఆ తర్వాత పవన్, అలీ ఎప్పుడూ కలిసి కనిపించలేదు.
అలీ కుమార్తె వివాహానికి కూడా హాజరు కాని పవన్
ఇటీవల అలీ తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆ వేడుకకు కూడ పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. అయితే తమ మధ్య గ్యాప్ లేదని.. పవన్ కల్యాణ్ తన మిత్రుడేనని అలీ చెబుతూ ఉంటారు. రాజకీయం.. స్నేహం వేరని అంటున్నారు. అయితే పవన్ ను అలీ చాలా తక్కువ చేసి మాట్లాడారని.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన తీరుపై పవన్ కూడా నొచ్చుకున్నారని.. రాజకీయంగా అలీ నిర్ణయాన్ని ప్రభావితం చేయాలని కానీ.. తన పార్టీలో చేరాలని కానీ ఎవర్నీ పవన్ ఎప్పుడూ ఆహ్వానించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే రాజకీయంగా విమర్శలు చేస్తే తప్పు లేదు కానీ పవన్ విషయంలో అలీ చేసిన విమర్శలు హద్దులు దాటాయని పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తూ ఉంటారు.
రాజకీయాల కారణం పవన్, అలీ మధ్య ప్రెండ్ షిప్ కి బ్రేక్
కారణం ఏదైనా పవన్ కల్యాణ్, అలీల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు పవన్ కల్యాణ్‌పై ఒక్క సారిగా విమర్శల దాడి చేస్తున్న సమయంలో.. అలా అలీ.. పవన్ పై పోటీ ప్రకటన చేయడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించడానికి వైఎస్ఆర్‌సీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఒక వేళ పవన్ కు గట్టి పోటీ ఇచ్చేది అలీ అని భావిస్తే.. జగన్ ఆదేశించడానికి వైఎస్ఆర్‌సీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చంటున్నారు.
ఇప్పుడు పవన్ పై పోటీకి సిద్ధమని అలీ మరో ప్రకటన
అయితే అసలు అలీకి ఈ సారి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించే అవకాశాలు లేవని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం టిక్కెట్ల కసరత్తు ఎప్పుడో ప్రారంభించారని... అలీకి ఎక్కడైనా టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే.. ఆయనను నియోజకవర్గంలో పని చేసుకోమని సూచించేవారంటున్నారు. అలా టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి.. ఆయనకు ఇటీవల సలహాదారు పదవి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు అలీ ప్రకటనతో .. పవన్ కల్యాణ్ పై పోటీకి అలీని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ పరిశీలిస్తుందేమో చూడాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి