Fact Check  :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటనలో సీమ పర్వీన్ విభిన్న ప్రతిభావంతురాలైన మహిళ పెన్షన్ ను ప్రభుత్వం తీసివేయడంపై మండిపడ్డారు. ఇలాంటి వారి పెన్షన్లు ఎలా తీసేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదన్నారు. 2021 వరకూ వచ్చిన పెన్షన్ ను తర్వాత తీసేశారని విమర్శించారు. సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ప్రశ్నించారు. సీమా పర్వీన్ ఫోటోలు, ఇతర పత్రాలు పోస్ట్ చేశారు. 





చంద్రబాబునాయుడు ట్వీట్ వైరల్ అయింది. ప్రభుత్వం పెన్షన్ల తీసివేతలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వచ్చాయి. దీనిపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ స్పందించింది.  ఆమె అనర్హురాలు కావడం వల్లే ఆమె పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన 22 ఏళ్ల సీమా పర్వీన్ 2021 సెప్టెంబర్ వరకు దివ్యాంగ పింఛన్ అందుకుంది. కానీ ఆ తర్వాత రెండు కారణాల వల్ల ఆమె పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. ఈ మేరకు ఆమెకు 2021 సెప్టెంబర్ లోనే నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. 


 





 
ఆమె పెన్షన్ తొలగించడానికి మొదట కారణం ఆమె కుటుంబ గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉంది. ఈ మేరకు ఆమెకు మచిలీపట్నం నగర పాలక సంస్థ నోటీసు పంపి వివరణ కోరడం జరిగింది. 2021 సెప్టెంబర్ ముందు వరకు ఆమె కుటుంబ గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కన్నా తక్కువ ఉందని తెలిపింది. ఆమె పెన్షన్ తొలగించడానికి రెండో కారణం ఆమె  కుటుంబానికి మచిలీపట్నంలో 2,475 చదరపు అడుగుల ఆస్తి ఉంది. నవశకం పోర్టల్ లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ కారణాల దృష్ట్యా మాత్రమే ఆమె పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు. 
 


 దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి సంతృప్త స్థాయిలో అత్యధిక సంఖ్యలో పెన్షన్లు, అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది.  అయితే ప్రభుత్వం అనర్హతకు కారణం చెప్పిన కరెంట్ బిల్లు.. నాలుగు విద్యుత్ మీటర్లకు సంబంధించినట్లుగా చెబుతోంది. వారుఉంటున్న భవనం మొత్తం నాలుగు మీటర్లు ఉంటే..  వాటిలో మూడు మీటర్లు అద్దెకు ఉండే ఇతర కుటుంబాలు వినియోగించుకుంటాయి. అయినా అన్ని మీటర్లు పర్వీన్ కుటుంబం మీద చూపించి పెన్షన్ తీసేశారన్న విమర్శలు వస్తున్నాయి.