ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగడం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ కూటమి (NDA) గెలిచే పరిస్థితి లేదని చెప్పినట్లు Way2News రిపోర్ట్ చేసినట్లు ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వైరల్ అవుతున్న పోస్టులో (ఇక్కడ & ఇక్కడ)  వాస్తవం ఏంటని ఇక్కడ తెలుసుకుందాం.

  




ఈ వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడండి.


క్లెయిమ్: ఏపీ ఎన్నికల్లో తమ ఎన్డీఏ కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు అని Way2News రిపోర్ట్ చేసింది.


ఫాక్ట్(నిజం): ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు ఎక్కడా వ్యాఖ్యానించలేదు. ఈ Way2News క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేశారు. ఇదే విషయాన్ని Way2News కూడా స్పష్టం చేసింది. కనుక ఈ క్లెయిమ్‌లో వాస్తవం లేదు. అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.


ఏపీలో ఎన్నికల్లో చంద్రబాబు ఉండవల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారని ప్రచారం జరగగా.. వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌ సంబంధించి ఫ్యాక్ట్‌లీ టీమ్ సెర్చ్ చేయగా..  ఓటేసిన తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడిన క్లిప్ ఒకటి కనిపించింది. మంచి భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు బదులిస్తూ ‘100శాతం’ అని చంద్రబాబు బదులిచ్చారు. కాగా, తమ కూటమి గెలవడం కష్టం అని చంద్రబాబు అన్నట్లుగా ఎలాంటి వార్తగానీ, రిపోర్ట్స్ గానీ కనిపించలేదు.






ప్రస్తుతం షేర్ అవుతున్న Way2News క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేసినట్లు తేలింది. మరింత సమాచారం కోసం వెతకగా Way2News తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆ క్లిప్‌ను తాము పబ్లిష్ చేయలేదని వెల్లడించిన ట్వీట్ కనిపించింది. ఇది ఫేక్ న్యూస్ క్లిప్ అని, తమ లోగోను ఉపయోగించి దుష్ప్రచారం చేస్తున్నారని Way2News స్పష్టం చేసింది.






 


Way2News  సాధారణంగా తమ న్యూస్ క్లిప్‌లలో ఆ వార్తలకు సంబంధించిన ఒక వెబ్ లింక్‌ ఇస్తుంది. అయితే ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో అందించిన లింక్ అడ్రస్‌తో సెర్చ్ చేయగా.. స్కూల్ పిల్లలకు అందించే పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు అని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల న్యూస్ క్లిప్ అని తెలిసింది.




కాగా, ఏపీ ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నట్టు Way2News పేరుతో షేర్ అవుతున్నది ఫేక్ న్యూస్ క్లిప్ అని స్పష్టమైంది.


This story was originally published by Factly, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.