Fact Check : విజయనగరం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలో అందరికీ మహారాజా ఆస్పత్రి అంటే తెలిసింది. ఒక్కటే్ విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రినే మహారాజా ఆస్పత్రి అని పిలుస్తారు. వారు పిలుపునకు తగినట్లుగానే ఆ ఆస్పత్రికి మహారాజా ప్రభుత్వ వైద్య శాల అనే బోర్డు కూడా ఉంటుంది. అయితే ప్రభుత్వం మూడు రోజుల కిందట ఆ పేరును తొలగించింది. ప్రభుత్వ సర్వజన వైద్య శాల అని పేరు మార్చి రాత్రికి రాత్రే కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. దీనిపై రాజకీయపార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మహానుభావుల్ని అవమానపరుస్తున్నారని.. అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని వేధించడానికే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి ఈ పేర్ల పిచ్చేమిటనేది వారి ప్రశ్న.
అయితే ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ఏపీ పోలీసులు నిర్వహిస్తున్న ప్యాక్ట్ చెక్ ఏపీ స్పందించింది. మహారాజా ఆస్పత్రికి .. ఆ పేరును తొలగించినట్లుగా వచ్చిన వార్తలు ఫేక్ వార్తలుగా స్పష్టం చేసింది. అంటే ఆ విజయనగరం ఆస్పత్రికి అదే పేరు ఉందా అని.. అని జనం అనుకుంటారేమో కానీ.. ఫ్యాక్ట్ చెక్ ఏపీ చెప్పింది మాత్రం వేరే. ఇప్పుడే కాదు అసలు ఎప్పుడూ మహారాజా పేరు ఆస్పత్రికి లేదు. ఈ విషయంపై ఫ్యాక్ట్ చెక్ ఏపీ పరిశోధన చేసి .. కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది. 1983లో ఆస్పత్రికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు శంకుస్థాపన చేసినప్పుటి శిలాఫలకం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
అదే సమయంలో ప్రభుత్వం ఆ ఆస్పత్రిని మెడికల్ కాలేజీగా అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కానీ పేరు మార్చమని ఎక్కడా చెప్పలేదని ఫ్యాక్ట్ చెక్ పోలీసులు చెబుతున్నారు. రెండు, మూడు రోజుల కిందటి వరకూ మహారాజా జిల్లా ఆస్పత్రి అనే బోర్డు ఉండేది. రాత్రికి రాత్రి దాన్ని తొలగించారు. అయితే రికార్డుల్లో మహారాజా ఆస్పత్రి అని లేదని.. అందుకే ఆ బోర్డు తీసేసి.. కొత్త బోర్డు పెట్టామన్నట్లుగా ఫ్యాక్ట్ చెక్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు కాదు.. ఆ ఆస్పత్రి ప్రారంభించినప్పటి నుంచి ఆ ఆస్పత్రికి మహారాజా ఆస్పత్రి అనే పేరే ఉంది. అయితే పోలీసులు మాత్రం ఎప్పుడూ ఆ ఆస్పత్రికి మహారాజా వారి పేరు లేదంటున్నారు.
పూసపాటి వంశీయులు విజయనగరం జిల్లాలో ప్రజోపయోగ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భూములు విరాళంగా ఇచ్చారు. ఇలా వారిచ్చిన భూముల్లో ప్రభుత్వం నిర్మించిన అనేక ప్రజా ఉపయోగ భవనాలకు మహారాజా అని పేరు పెట్టడం కామన్‌గా జరిగింది. అదే సమయంలో మహారాజా వారి మాన్సాస్ ట్రస్ట్‌లో కూడా మహారాజా సంస్థలు నడుస్తూ ఉంటాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేరు తీసేయడమే కాకుండా ఎప్పుడూ అలాంటి పేరు లేదని చెప్పడానికి ప్రయత్నించడం మంచిది కాదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.