Mothkupalli narsimhulu: ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారని, జైల్లో కిరాతకులుండాలని మోత్కుపల్లి అన్నారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వాళ్లు జైల్లో కాదని, ప్రజల మధ్య ఉండాలన్నారు. మీరు జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా ? అంటూ జగన్ ను ప్రశ్నించారు. జగన్‌ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా ? రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయిందన్నారు. టీడీపీ చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ బేగంపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. దసరా వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. 


'ఇక నీ ఆటలు సాగవు'


జగన్మోహన్ రెడ్డి ఇక ఆటలు సాగవని, మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరని మోత్కుపల్లి హెచ్చరించారు. మీ నాన్న పాలించినా ఇంత కుట్ర చేయలేదన్న ఆయన, కడుపు మండి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్‌ను చంపిన పాపం జగన్‌దేనన్న ఆయన, పేద ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆయన దుర్మార్గాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు జగన్ ఆటకట్టిస్తారని మోత్కుపల్లి హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారన్న ఆయన, చంద్రబాబును మానసిక క్షోభకు గురి చేస్తుంటే తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా కుట్ర చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. 


సీఎందే బాధ్యత


రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకి ఏమైనా జరిగితే సీఎంలు కేసీఆర్, జగన్, బీజేపీనే బాధ్యత వహించాలని మోత్కుపల్లి అన్నారు. సీఎం జగన్ మరోసారి ఎన్నికల్లో డబ్బు పంచి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండించారు. దేశంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడే నేత కానే కాదని, క్రిమినల్ అసలే కాదని మోత్కుపల్లి అన్నారు. స్కిల్ కేసు పేరుతో ఎన్నికల ముందు అరెస్టు చేయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు అవినీతి చేశాడని ఆరోపిస్తున్న జగన్, ఈ నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడని నిలదీశారు. రూ.లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రజలకు సొమ్ము పంచిన వ్యక్తి చంద్రబాబు అని, రూ.370 కోట్లకు ఆశపడతారా అని ప్రశ్నించారు. 


కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరం


మోత్కుపల్లి నర్సింహులు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. ఆయన సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్నారు. 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సల్లూరు పోశయ్యపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరారు. 1985లో ఆలేరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో ఇండిపెండెంట్ గా, 1994 తెలుగుదేశం పార్టీ తరఫున, 1999లో కాంగ్రెస్ తరఫున, 2009లో తుంగతుర్తి అసెంబ్లీ నుంచి గెలుపొందారు. అనంతరం 2021, అక్టోబర్ 18న తెలంగాణ భ‌వ‌న్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.