ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల జీతాలు ఇంకా అందలేదు. ఈ సారి సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు లాంటివేమీ కారణాలు చెప్పడంలేదు. అసలేం చెప్పడం లేదు. ఈ ఒక్క నెలేనా ప్రతీ నెలా ఆలస్యమేగా అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. మరో వైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుల అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం తాము అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని చెబుతోంది. అయితే కొన్ని రకాల రుణాల గురించి చెప్పడానికి ఏపీ ప్రభుత్వం తటపటాయిస్తోంది. వాటి గురించి చెప్పాల్సిందేనని కేంద్రం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ గ్యారంటీల వివరాలను అడుగుతున్న కేంద్రం !
కొత్తగా రుణ పరిమితి పెంచాలంటే నేరుగా చేసిన అప్పులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను కూడా సమర్పించాలి. కానీ ఏపీ ప్రభుత్వం గ్యారంటీల వివరాలు సమర్పించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్యారెంటీ వివరాలను అందించాలని కేంద్రం కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై 26 ప్రశ్నలతో నమూనాను ఏపీ చీఫ్ సెక్రటరీకి పంపినట్లుగా చెబుతున్నాయి. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి ఈ వివరాలు ఓచర్ లెవెల్ కంప్యూటరైజేషన్ విభాగం సిఎస్‌కు లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ఏ సంస్థకు ఎంత గ్యారెంటీ ఇచ్చారన్న దానితోపాటు ఆ రుణానికి సంస్థలు చేస్తున్న వాయిదాల చెల్లింపులు, గడువు తేదీల వివరాలు కూడా సమర్పించాలని కోరింది. ఈ గ్యారెంటీలకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు కూడా ఇవ్వాలని, ఏవైనా రుణాలను రీషెడ్యూల్ చేశారా అన్నది చెప్పాలని లేఖలో పేర్కొన్నారు.
కార్పొరేషన్ల అప్పులపైనే కేంద్రం ఆరా !
ఏపీ ప్రభుత్వం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి గ్యారంటీ ఇచ్చి రుణాలు తీసుకుంది. ఆ సంస్థలు ఆ రుణాలను ఏ అవసరానికి తీసుకున్నాయన్నది కూడా చెప్పాలని ఎజి కార్యాలయం కోరుతోంది. గ్యారెంటీల ద్వారా ఆయా సంస్థలు ఏయే బ్యాంకుల నంచి, ఏయే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్న వివరాలను కూడా ప్రశ్నావళిలో చేర్చారు. ఈ గ్యారెంటీల మొత్తం 2021 మార్చి నెలాఖరుకు, 2022 మార్చి నెలాఖరుకు ఎంత ఉన్నాయన్నది కూడా చెప్పాలని కోరింది. ఒప్పందం మేరకు రుణం తీసుకున్న నాటి నుంచి ఎంత అసలు చెల్లించారు, ఏమైనా గారెంటీల కాలపరిమితి ముగిసిందా అన్న వివరాలపైనా ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ గ్యారెంటీల ద్వారా రుణాలు తీసుకున్న సంస్థల వార్షిక టర్నోవర్ల వివరాలు కూడా సమర్పించాలని ఎజి కార్యాలయం కోరినట్లుగా తెలుస్తోంది .
లెక్కలు చెప్పడానికి తటపటాయిస్తున్న ఏపీ !
కేంద్ర ఆర్థిక శాఖ నుంచి.. ఆర్బీఐ నుంచి... అకౌంటెంట్త జనరల్ కార్యాలయం నుంచి అదే పనిగా అప్పుల వివరాలు కోరుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖలు వస్తున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు ఈ మేరకు సమాచారం పంపుతున్నారు. కానీ వారు పంపుతున్న సమాచారం సమగ్రంగా ఉండటం లేదన్న కారణంగా అవి వెనక్కి వస్తున్నాయి. వారు సంపూర్ణమైన సమాచారం ఇచ్చిన తర్వాతనే కేంద్రం ఈ ఏడాది కొత్త రుణానికి అనుమతి ఇస్తుందని భావిస్తున్నారు. అయితే తాత్కాలికంగా అయినా అప్పులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులు కేంద్రం వద్ద ప్రస్తుతం లాబీయింగ్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.