అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడు ఒకరు దుర్మరణం చెందాడు. వెస్ట్‌ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 లకు జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి వీర సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్‌, 1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌ పని చేస్తున్న వీర.. దోపిడీకి ప్రయత్నించిన దొంగను అడ్డుకున్నాడు. దాంతో రెచ్చిపోయిన దుండగులు, సాయిష్ వీరపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, కాల్పులకు తెగబడిన అనుమానితుడి ఫోటోలను కొలంబస్‌ పోలీసులు విడుదల చేశారు. ఈ సంవత్సరం కొలంబస్‌లో ఇది 50వ హత్య కావడం గమనార్హం.


తీవ్ర విషాదం
24 ఏళ్ళ సాయిష్ వీర మరో రెండు వారాల్లో ఉద్యోగం మానేయాలని అకున్నాడు. కానీ, ఇంతలోనే ఈ అనుకోని ఘటన జరగడం.. అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాయిష్ వీర కొలంబస్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. H1 - B వీసా కూడా తీసుకున్నాడు. అందరికి అడగ్గానే హెల్ప్ చేసే వాడనీ.. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సాయిష్ వీర బాడీని అమెరికా నుంచి భారత్‌కు తరలించేందుకు స్నేహితులు సన్నాహాలు చేస్తున్నారు. తరలింపు భారీ ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల ఫండ్ రైజింగ్ చేపడుతున్నారు. సాయిష్ బాడీని ఇండియాలోని సొంతూరికి తరలించేందుకు సాయం చేయాలని అతని స్నేహితుడు నవీన్ క్రిష్ణ కాపిశెట్టి ట్విటర్‌లో కోరారు. అందరూ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు. అతనికి కుటుంబానికి మేలు చేసినవారు అవుతారని పిలుపునిచ్చారు. ఇందుకోసం భారత ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతూ.. ప్రధాన మంత్రి కార్యాలయాన్ని, అమెరికాలోని ఇండియన్ ఎంబసీని, హైదరాబాద్ లోని అమెరికన్ ఎంబసీని ట్యాగ్ చేశాడు. సాయిష్ కుటుంబానికి అతని చివరి చూపులు కల్పించే బాగ్యం కల్పించాలని కోరాడు.