EC Gives Glass Symbol For Janasena Party: అమరావతి: సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీకి ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు (Glass Tumbler Symbol)ను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన ఉత్తర్వులు ఈ మెయిల్ ద్వారా జనసేన సెంట్రల్ ఆఫీసుకు అందాయని ఓ ప్రకటనలో పార్టీ వెల్లడించింది. 


త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయడం తెలిసిందే. మరోసారి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీకి సిద్ధంగా ఉన్నారు. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.


గాజు గ్లాసు గుర్తుతో బరిలోకి జనసేన అభ్యర్థులు 
జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తును గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా జరిగింది. అయితే జనసేన పార్టీ రిక్వెస్ట్ తో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకు జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయనున్నారు. దాంతో జనసేనకు ఎన్నికల గుర్తు సమస్య తొలగిపోయింది. జనసేనకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఈసీకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.


వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన రాజకీయ పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. ఇదివరకే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై చర్చించారు. చివరగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తొలిసారి పవన్ కళ్యాణ్ వెళ్లి భేటీ అయ్యారని తెలిసిందే. టీడీపీ నుంచి చంద్రబాబు, నారా లోకేష్, జనసేన నుంచి పవన్, నాదెండ్ల మనోహర్ ఆ భేటీలో పాల్గొన్నారు. జనసేన స్ట్రాంగ్ గా ఉన్న స్థానాల్లో సీట్లు కావాలని చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు. కానీ కాపు నేతలు మాత్రం సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని జనసేనానిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందా.. లేక వేరే ఏ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుంది అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. తమతో పొత్తు కోసం టీడీపీ నుంచి రిక్వెస్ట్ రావాలని జనసేన నేతలకు సూచించడం తెలిసిందే.