Election Commission Key Orders On Attack on CM Jagan Incident: ఏపీ సీఎం జగన్ (CM Jagan)పై రాయి దాడి ఘటనను ఎన్నికల సంఘం (Election Commission) సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena).. విజయవాడ సీపీ కాంతి రాణాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్న ఆయన.. పూర్తి నివేదికను పంపించాలని కోరారు. దాడికి పాల్పడ్డ నిందితులను త్వరగా గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో జీరో వయలెన్స్ ఎన్నికలే లక్ష్యంగా చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం.. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో అసహనం వ్యక్తం చేసింది. పోలీసులకు తగు ఆదేశాలు జారీ చేసింది. కాగా, శనివారం విజయవాడలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర సందర్భంగా సింగ్ నగర్ వద్ద సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. అది సీఎం కంటికి తగిలి గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులోనే ప్రాథమిక చికిత్స అందించారు.


పోలీసుల దర్యాప్తు ముమ్మరం


మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. స్థానికంగా ఓ స్కూల్ భవనం, గంగానమ్మ గుడికి మధ్యలో చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుడివైపు జనావాసాలు ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని నిందితుడు ఎంచుకున్నట్లు గుర్తించారు. పూర్తిగా చీకటి, చెట్లు ఉండడంతో ఎవరికీ కనిపించకుండా.. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని నిందితుడు ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 30 అడుగుల దూరం నుంచి రాయిని బలంగా విసిరినట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం ప్రవేశించగానే.. రాత్రి యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తుండడాన్ని ఆగంతుకుడు ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లికి సైతం గాయమైనట్లు తెలుస్తోంది. సీఎం, వెల్లంపల్లికి తగిలిన రాయి ఒకటేనా లేక.. వేర్వేరా అనే దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను విచారణ కోసం కేటాయించగా.. సీఎంపై దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు డ్రోన్ విజువల్స్ పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు విజువల్ అనాలసిస్ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 


ప్రధాని మోదీ ట్వీట్


సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. 'ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. 






అటు, సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో ఆదివారం 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు బ్రేక్ పడింది. అర్ధరాత్రి ట్రీట్మెంట్ తర్వాత సీఎం జగన్ కేసరపల్లికి వెళ్లారు. ఇవాళ అక్కడే రెస్ట్ తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కలిసేందుకు భారీగా నేతలు, కార్యకర్తలు తరలివస్తుండగా పోలీసులు వెనక్కు పంపిస్తున్నారు. 


Also Read: Chandrababu on Jagan: జగన్‌పై రాయి దాడి ఘటనపై చంద్రబాబు స్పందన ఇదే, గ్రేట్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్!