Andhra Pradesh Assembly Elections 2024: ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)వ్యాప్తంగా ఎలక్టోరల్‌ అబ్జర్వర్ల (Electoral Observers)ను నియమించింది. 2024 స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ రూపకల్పన తనిఖీ కోసం ఐదుగురు అబ్జర్వర్లను నియమిస్తూ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా తనిఖీకి ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌లను నియమించారు. ప్రతి జిల్లాలో మూడు పర్యాయాలు పర్యటించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు డి.మురళీధర్‌, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు ఎన్‌.యువరాజ్‌లను నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు జె.శ్యామలరావు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాలకు బి.శ్రీధర్‌, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పోల భాస్కర్‌లను నియమించారు.


ప్రతి జిల్లాలో మూడు సార్లు పర్యటించాలి
2024 ఓటర్ల జాబితా సిద్ధం చేసేలోపు కేటాయించిన జిల్లాల్లో మూడుసార్లు తప్పనిసరిగా పర్యటించాలని అబ్జర్వర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. అభ్యంతరాల గడువు పూర్తయ్యే డిసెంబర్‌ 9లోగా తొలివిడత పర్యటించాలని సూచించింది. ఈఆర్వోలు సరిదిద్దే గడువు డిసెంబర్‌ 26లోపు రెండోవిడత పర్యటించాలని, జాబితా తుది తనిఖీ కోసం జనవరి 4లోగా మూడోసారి పర్యటించాలని ఆదేశించింది. తొలి పర్యటనలో ఓటర్ల జాబితా తయారీపై పార్టీల ప్రతినిధులతో భేటీ కావాలని, ఓటరు జాబితా తయారీలో వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది. గ్రామాల్లో ఓట్ల తొలగింపుపై తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివిధ జిల్లాల్లో ఓట్ల తొలగింపునకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంది. కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఫామ్‌-7 అడ్డుపెట్టుకుని, ఓట్ల వందల ఓట్లను జాబితా నుంచి తీసివేయించేందుకు వైసీపీ నేతలు దరఖాస్తు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో ఫామ్‌-7 ద్వారా ఓట్లు తొలగించాలని 858 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 663 దరఖాస్తులు అధికార వైసీపీ నేతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 


ఒకే ఇంట్లో 23ఓట్ల తొలగింపునకు కుట్ర
గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/19 లోని 140 పోలింగ్ బూత్ పరిధిలో, ఒకే సామాజిక వర్గానికి చెందిన 23 మంది ఓట్లు తొలగించాలంటూ అధికార పార్టీ నేత శేషిరెడ్డి కొండా దరఖాస్తు చేయడం ఆలస్యంగా బయటపడింది. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటూ, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని చెబుతున్నారు. వైసీపీ నేతలు కావాలనే తమ పేర్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. 


గత నెలలో నలుగురు ఆఫీసర్లపై వేటు
కొద్ది రోజుల క్రితం బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా సవరణలో జోక్యం చేసుకున్న పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్టూరు సీఐ టి.ఫిరోజ్‌,  పర్చూరు ఎస్సై ఎన్‌సీ ప్రసాద్, మార్టూరు ఎస్సై కె.కమలాకర్, యద్దనపూడి ఎస్సై కె.అనూక్‌ను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై నలుగురు అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన ఫారం-7 దరఖాస్తుల సమాచారాన్ని సేకరించి అధికార పార్టీ నేతలకు చేరవేసినట్లు టీడీపీ గుర్తించింది.