Election code has been lifted in AP : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన కారణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉంది. ఇప్పుడు నలబై ఎనిమిది గంటలు పూర్తయినందున కోడ్ ఎత్తివేశారు.
కొత్త ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన సీఈవో మీనా
ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి రాష్ట్రంలో 25 పీసీలకు మరియు 175 ఏసీలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేయడం జరిగిందని సీఈవో మీనా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నేటి సాయంత్రం నుండి నిలుపుదల చేసినట్లు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.
ఆపద్ధర్మ సీఎంగా జగన్ - కానీ టీడీపీ నేతల ఆదేశాల మేరకే నిర్ణయాలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పరిపాలన అంతా ఈసీ కనుసన్నల్లోనే జరుగుతుంది. కానీ కోడ్ ఎత్తేశాక పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆపద్ధర్మ సీఎంగా జగన్ కొనసాగుతారు. అయితే ప్రభత్వంలో ఎవరూ ఆయన మాట వినరు. ఆదేశాలను పాటించరు. ఎందుకంటే టీడీపీ విజయం సాధించింది కాబట్టి .. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నారు. అధికారులంతా ఇప్పటికే చంద్రబాబుకు రిపోర్టు చేస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే కీలక నిర్ణయాలు
సీఎస్ ను సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించారు. అలాగే గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటన్న వారు.. సెలవులు పెట్టి వేరే దేశాలకు వెళ్లాలనుకంటున్నారు. కానీ ఎవర్నీ రిలీవ్ చేయవద్దని ఆదేశించారు. దీంతో సెలవులు కూడా నిలుపుదల చేశారు. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . చిన్న సమాచారం కూడా బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.