NRI Hospital ED  : గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్నారై మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో రెండు రోజుల పాటు ఈడీ నిర్వహించిన సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు కీలక ఆధారాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది.  నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఆర్ధిక లావాదేవీల వివరాలను డాక్యుమెంట్లతో  ఈడీ  స్వాధీనం చేసుకుంది.   ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నుంచి సుమారు రూ. 25 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్టు  ఆధారాలు లభించాయని చెబుతున్నారు.  ఎంబీబీఎస్, పీజీ సీట్ల ఫీజుల్లో నుంచి నిధులను కొందరు డైరెక్టర్లు మళ్లించినట్టు సోదాల్లో తేలింది. అలాగే భవనాల నిర్మాణం పేరుతో రూ. 4 కోట్లు మళ్లించారని..   పలువురు ఎన్ఆర్ఐలు పన్ను రాయితీల కోసం విదేశాల్లో ఇచ్చిన విరాళాలను ఇక్కడ కొందరు డైరెక్టర్లు డ్రా చేసుకున్నట్టు సోదాల్లో వెల్లడయింది.  


రికార్డుల్లోకి కోవిడ్ పేషంట్ల వివరాలు పోందుపర్చకుండా నిధులను మళ్లించారన్న అంశంపై ఈడీకి చిక్కిన పక్కా ఆధారాల లభించాయి. 1500కు పైగా రోగుల నుంచి రూ. 30 కోట్లకు నగదు పక్కదారి పట్టినట్టు  తేల్చారు. ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్లలో ఒకరైన అక్కినేని మణి విజయవాడలో నిర్వహిస్తున్న అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిలో ఇంకా ఈడీ సోదాలు చేశారు.  విదేశీ నిధులను సొంత ఖాతాలకు మళ్లించారన్న ఆరోపణలపై ఆధారాలు సేకరించారు.  ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ సీట్ల ద్వారా రూ.కోట్లు సేకరించారని గుర్తించిన ఈడీ.. పలువురు ఎన్‌ఆర్‌ఐలు, ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.  


ఎన్నారై ఆస్పత్రి బోర్డులో డైరెక్టర్లు కొంతమంది ఆస్పత్రి నిధులను, కొవిడ్‌ నిధులను పక్కదారి పట్టించారని గతంలోనే మంగళగిరి పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. అక్కినేని మణితోపాటు మరికొంతమంది ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా రూ.5.28 కోట్లను దుర్వినియోగం చేశారని పోలీసులు తేల్చి చార్జిషీటు కూడా దాఖలు చేశారు.  ఈ క్రమంలో తొమ్మిది మంది మహిళా వైద్యులతో కలిసి మణి బయటకు వచ్చారు. గత ఆగస్టు లో అక్కినేని ఉమన్స్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆస్ప త్రి చైర్మన్‌, ఎండీగా మణి వ్యవహరిస్తున్నారు. మిగిలిన 9మంది మహిళా వైద్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ఆస్పత్రికి ఎక్కువగా అక్రమంగా నిధుల బదిలీ అయినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. 


అక్కినేని మణితో సహా 11 మంది ఆస్పత్రి డైరెక్లర్ల ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ల కాల్‌డేగా, ఆన్‌లైన్ లావాదేవీలను ఈడీ ఆరా తీశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రెండు ఆసుపత్రుల నుంచి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  అక్కినేని ఆస్పత్రి నిర్మాణం, ఇతర  వ్యవహారాలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఈడీ అధికారులు ఆరా తీశారు. ఈ వ్యవహారంలో అక్కినేని మణి పాత్రపై వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.  పిలిచినప్పుడు విచారణకు రావాల్సిందిగా కూడా ఈడీ అధికారులు సూచించారు.  ఈడీ అధికారులు పూర్తి అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి చేసే అవకాశం ఉంది.