PVP ED Office  :  వైఎస్ఆర్‌సీపీ నేత పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈడీ ఆఫీసులో పలు కీలక కేసుల విచారణకు ప్రముఖులు హాజరవుతూండటంతో మీడియా ఆసక్తిగా ఆయన ఏ కేసులో హాజరయ్యారా అని ఆరా తీసింది. ప్రస్తుతం ఈడీ చీకోటి ప్రవీణ్ కేసినో కేసులో విచారణ జరుపుతోంది. ఆ కేసులో వంద మందికిపైగా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పీవీపీ కూడా హాజరయ్యారని అనుకున్నారు. కానీ పీవీపీ మాత్రం...తాను హాజరయింది కేసినే కేసు కాదని.. జగన్ అక్రమాస్తుల కేసులో అని ప్రకటించారు. జగతి పబ్లికేషన్స్ లో తాము పెట్టిన పెట్టుబడుల గురించి ఈడీ వివరాలు అడిగిందని.. అవి ఇవ్వడానికి వచ్చానని తెలిపారు. 


గత పదేళ్ళుగా ఈడి కార్యాలయానికి వస్తునే ఉన్నానని.. ఇదేం కొత్త కాదని ఆయన చెప్పారు. తాను చాలా వ్యాపారాలు చేస్తున్నానన్నారు.  జగతి పబ్లికేషన్స్ అంశంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చానని..  ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామమన్నారు. వాళ్లు అడిగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేశామమన్నారు.  పెట్టుబడులకు సంబంధించిన వివరాలు అడిగారు వాటిని కూడా ఇచ్చామన్నారు. ఈడీ ఆపీసులు రావడం తనకు ఇది ఇరవయ్యో సారని.. కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. పొట్లూరి వరప్రసాద్ (మారిషస్)కు చెందిన పీవీపీ వెంచర్స్, క్యూబైడ్, పీవీపీ బిజినెస్ టవర్స్ సంస్థలు జగతిలో భారీగా పెట్టుబడులు పెట్టాయి.
 


జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఉన్న 74 మంది నిందితుల్లో పొట్లూరి వరప్రసాద్ 19వ నిందితుడు. మారిషస్ లో ఓ కంపెనీని నెలకొల్పిన ఆయన.. అక్కడి నుంచి స్వదేశంలోని పలు కంపెనీలకు పెట్టుబడులు తీసుకొచ్చారు. 2007లో మారిషస్‌లో ప్లాటెక్స్ అనే కంపెనీని పీవీపీ స్థాపించారు.  ఆ సంస్థ నుంచి వందల కోట్ల నిధులను స్వదేశంలోని కంపెనీలకు తరలించారు.  ఇదే క్రమంలో జగతి పబ్లికేషన్ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టారు. జగన్ మీడియాల్లో దాదాపు రూ.131కోట్ల పెట్టుబడులు పీవీపీ పెట్టారు.  ఇందుకు ప్రతిఫలంగా వైఎస్ఆర్ హయాంలో పీవీపీ సంస్థలకు భారీ భూకేటాయింపులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దీనిపై   సీబీఐ కేసు నమోదు చేసి నిందితుడిగా చేర్చింది. 


పీవీపీ అధినేత పొట్లూరి వి ప్రసాద్ ప్లాటెక్స్ కంపెనీకి 100శాతం షేర్ హోల్డర్ గా ఉన్నారు. విదేశాల్లో స్థాపించిన ఈ కంపెనీకి తానే వ్యక్తిగత పూచీకత్తుగా ఉన్నారు. పలు ఆర్థిక సంస్థల నుంచి ఇరవై కోట్ల 76 లక్షల డాలర్లను, భారతీయ కరెన్సీలో రూ.886కోట్లను రుణంగా పొందారు. ఆపై ఆ సొమ్మును ఇండియాలోని తన లిస్టెడ్ కంపెనీ పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీలు న్యూ సైబరాబాద్ సిటీ ప్రాజెక్ట్స్, పీవీపీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి వాటికి తరలించారు. ఇదే క్రమంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ లోను పెట్టుబడులు పెట్టారు. అందుకు ప్రతిగా వైఎస్ఆర్ హయాంలో భూకేటాయింపులు జరగినట్టు ఆరోపణలు వచ్చాయి, క్విడ్ ప్రో కో కింద సీబీఐ అప్పట్లో పీవీపీ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించింది. 2016- 17 ఆర్థిక సంవత్సరం నివేదికను బట్టి జగతి పబ్లికేషన్స్‌లో తాము 130 కోట్ల 97 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. వీటిపైనే ఈడీ పీవీని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.