East Godavari : అరుదైన గాకర్స్ వ్యాధికి గురైన చిన్నారి హనీని బతికించుకోడానికి ఆ తల్లిదండ్రులు ఎన్నో ప్రయాత్నాలు చేశారు. రోజు రోజుకూ చిన్నారిని కబలిస్తున్న వ్యాధి నుంచి తమ బిడ్డను రక్షించుకునేందు చేయని ప్రయత్నం లేదు. చివరకు సీఎం దృష్టిలో పడడంతో వారి కష్టాలు తీరాయి. బుడి బుడి అడుగులేస్తున్న ఈ చిన్నారి ఎంతో యాక్టివ్. చాలా హుషారుగా అల్లరి చేస్తూ ఆడుకుంటుంది. పుట్టిన నాటి నుంచి ఏ రోజూ పేచీ పెట్టిన సందర్భమే లేదు. తనలో ప్రాణాంతక వ్యాధి నిలువెల్లా హరించేస్తున్నా ఆ పసిపాపకు అవేమీ తెలీదు. కమ్మనైన అమ్మప్రేమ, నులివెచ్చని నాన్న ఒడి. ఇదే ఆ పసి హృదయానికి తెలిసిందల్లా. అటువంటి ఈ చిన్నారికి అత్యంత అరుదుగా వచ్చే ప్రాణాంతక గాకర్స్ అనే వ్యాధి వచ్చింది.
ఏడాది వయసులో
ఏడాది వయసులో ఆ ప్రాణాంతక వ్యాధి చిన్న నలతగా వచ్చి తమ కంటిపాపను తమకు దక్కకుండా చేసేంత ప్రమాదకరంగా మారిందని కన్నవారు తల్లడిల్లిపోయారు. అయినవారు ఆవేదన చెందారు. తమ పాపను కాపాడాలని చేతులెత్తి మొక్కని వైద్యులు లేరు. తమ బిడ్డను బతికించుకునేందుకు ఎక్కని ఆసుపత్రి గడప లేదు. నయం అవుతుంది కానీ ఖర్చు మీరు భరించలేరని, మీ స్తోమతకు సరిపోదని చెప్పిన వైద్యులు, అత్యంత కష్టంగానే అక్షరాల కోటి రూపాయలకు పైబడి ఖర్చవుతుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
అసలేం జరిగింది?
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే అయోధ్యలంక గ్రామానికి చెందిన చిన్నారి హనీ వైద్యానికి రాష్ట ప్రభుత్వం కోటి రూపాయల విలువ గల మందులు అందించేందుకు బడ్జెట్ కేటాయించింది. అంతే కాదు పాపకు పింఛన్, కార్పొరేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేందుకు అధికారులను ఆదేశించింది. కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె హనీ అరుదైన వ్యాధి గాకర్స్ తో పోరాడుతోంది. ఇప్పుడు హనీ వైద్యానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వడంతో కన్నవారిలో సంతోషం కనిపిస్తోంది. ఇటీవల కోనసీమ వరద పరిస్థితులను పరిశీలించేందుకు కోనసీమ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ మార్గంలో ఫ్లకార్డు పట్టుకుని చిన్నారితో కలిసి నిలుచున్న రాంబాబు, నాగలక్ష్మిల ప్రయత్నం ఫలించింది. వారు ఊహించినట్లుగానే ముఖ్యమంత్రి జగన్ వీరిని చూశారు. వేగంగా వెళ్తోన్న కాన్వాయ్ ఆగింది. కారు దిగి మాట్లాడిన సీఎం జగన్ బిడ్డ వైద్యానికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సీఎం ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతులమీదుగా హనీ వైద్యానికి మందులు అందజేశారు.
అరుదైన వ్యాధికి వైద్యం, లక్షల్లో ఖర్చు
దేశంలో ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. చిన్నారి హమీ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లు మంజూరు చేసింది. మొదటి విడతగా 13 ఇంజెన్లు మంజూరు అందజేశామని కలెక్టర్ తెలిపారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.1,25,000 ఖరీదు కాగా కోటి రూపాయలు వరకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు.
ఎలాగైనా బతికించుకోవాలని
చిన్నారి హనీకు వచ్చిన అరుదైన వ్యాధి నుంచి రక్షించుకునేందుకు తల్లితండ్రులు రాంబాబు, నాగలక్ష్మి చేయని ప్రయత్నం లేదు. అధికారులను, ప్రజాప్రతినిధులను అవకాశం ఎప్పుడు కుదిరితే అప్పుడు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. చివరకు నిస్సాహాయ స్థితిలో ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి చేతిలో ఫ్లకార్డులు పట్టుకుని తమ వ్యధను సీఎంకు తెలిపేందుకు ప్రయత్నించారు. స్వయంగా ముఖ్యమంత్రే వెళ్తోన్న కాన్వాయ్ ను ఆపి తమ గోడు వినేలా చేసింది. ఆ బిడ్డ తలపై చేయివేసి నేనున్నానన్న భరోసాను ఇచ్చింది. ఫలితం కేవలం రెండు నెలల వ్యవధిలోనే అక్షరాల కోటి రూపాయల విలువ చేసే ఇంజెక్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ బిడ్డను కన్నవారి అనందానికి అవధులు లేవు.