AP Mobile Theatre : ఏపీలో మొదటి మొబైల్ సినిమా థియేటర్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రూపుదిద్దుకుంటుంది. ట్రక్కులో ఎక్కడికైనా తీసుకువెళ్లి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ అని నిర్వాహకులు చెబుతున్నారు. రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్ ను ఏర్పాటుచేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్ ను రూపొందిస్తున్నారు. “పిక్చర్ డిజిటల్స్” సంస్థ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ థియేటర్లలో ఇది మొదటిదని, ఆచార్య సినిమాతో థియేటర్ ప్రారంభం అవుతుందని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆచార్య సినిమాతో ఈ హాల్ ప్రారంభమౌతుందని అన్నారు. ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపమే ఈ మొబైల్ సినిమా ధియేటర్ అని తెలిపారు.
దేశంలో 1930లో తొలిసారిగా మొబైల్ థియేటర్లు
తెలుగు ప్రేక్షకుల దగ్గరకే సినిమా థియేటర్ వచ్చేస్తుంది. ఇకపై సినిమా థియేటర్ వరకూ వెళ్లక్కర్లేకుండా దానినే మన ప్రాంతానికి తెచ్చే వినూత్న ప్రయోగం చేస్తున్నారు. మనకు నచ్చిన సినిమాలను స్థానికంగా ప్రదర్శించేందుకు మొబైల్ థియేటర్ ను రూపొందిస్తున్నారు. దేశంలో తొలిసారిగా 1930లో కోహినూర్ ఒపేరా పేరుతో అసోం రాష్ట్రంలో మొబైల్ థియేటర్ ను ఏర్పాటుచేశారు. దీనిని నాట్యాచార్య బ్రజనాథ్ శర్మ 90 ఏళ్ల క్రితమే రూపొందించారు. అయితే ఈ థియేటర్ ద్వారా కోహినూర్ ఒపేరా ధుబ్రీ నుంచి సదియా వరకు వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షించిన నాటకాలను ప్రదర్శించారు. మొదటి మొబైల్ థియేటర్ లో అక్టోబర్ 2, 1963లో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం దేశంలో 150 వరకు మొబైల్ థియేటర్లు వివిధ ప్రాంతాల్లో నాటకాలు, సినిమాలు ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణలోనూ మొబైల్ థియేటర్
సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సందడి చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పిక్చర్ టైం సంస్థ, జిల్లా మహిళా సమాఖ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ మొబైల్ థియేటర్ సందర్శించారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన దర్శకుడు రాజమౌళికి కుమ్రంభీం వారసులతో పాటు, జిల్లా అధికారులు, అభిమానులు గుస్సాడిలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం థియేటర్లో ప్రేక్షకులతో RRR మూవీ వీక్షించారు. థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆహ్వానంతో ఇక్కడికి వచ్చానని, కుమ్రంభీం జిల్లాకు రావడం సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎయిర్ బెలూన్ తో ఏర్పాటు చేసిన థియేటర్ లో RRR సినిమా రెస్పాన్స్ బాగుందని విని వచ్చానన్నారు. మహిళలు సహకారంతో థియేటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో మహిళలంతా కలిసి థియేటర్ ఏర్పాటు చేయడం కేవలం ఇక్కడే జరిగిందని వారిని అభినందించారు. రాష్ట్రంలో చాలా పెద్దమొత్తంలో థియేటర్లు ఉండేవని, కానీ చాలా వరకు మూత పడ్డాయని, ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఎయిర్ బెలూన్ థియేటర్ లు రావడం సంతోషంగా ఉందన్నారు. కుమ్రంభీం పుట్టిన గడ్డపైన భీం పాత్రలో ఎన్టీఆర్ ను చూడడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయని విన్నానని, అవకాశం వస్తే మళ్లీ జిల్లాకు వస్తానన్నారు.