Nadendla Manohar : ప్రజల సమస్యల పట్ల స్పందించే హృదయంలేని వ్యక్తులు అధికారంలో కొనసాగే అర్హత లేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇటీవల మృతి చెందిన జనసేన క్రియా శీలక కార్యకర్తల కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కులు కాకినాడ హెలికాన్ టైమ్స్ క్లబ్ లో అందించారు. జనసేన కార్యకర్తలు కత్తిపూడి గ్రామం జీలకర్ర శ్రీను తరపున జీలకర్ర స్వామి, అమలాపురం నియోజకవర్గo పిల్లా శ్రీనివాస్ తరఫున పిల్లా రాజమణిలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, ప్రమాదంలో గాయాలపాలైన డోల్లంకి వీరబాబు అనపర్తి, డేగల సాయిబాబు, గంధం వీర వెంకట రమణ, మోటుపల్లి రామారావు, కొక్కెరమెట్ల సాయి మనోజ్ లకు రూ.50 వేల చెక్కులు అందించారు.
జగనన్న కాలనీల్లో సోషల్ ఆడిట్
జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రమాద బీమా ఒక్కోక్కరికి రూ.5 లక్షల చెక్కులు అందించామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం కార్యాలయం ప్రజా సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. వైద్య చికిత్సలు కోసం సామాన్యులు సీఎంను ఆశ్రయించడం సర్వసాధారణమన్నారు. ఇటీవల ఓ మహిళ సీఎం కార్యాలయం ముందు వేచి ఉన్నా పట్టించుకోలేదన్నారు. సీఎంవో కార్యాలయం సాయం కోసం వచ్చిన మహిళను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. సీఎం స్పందిస్తారని ఆశించి భంగపాటు చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ఇలాంటి ఘటనలు గమనించి పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం ప్రారంభిస్తే అడుగడుగునా అవరోధాలు సృష్టించారని ఆరోపించారు. సమస్యలు పట్ల స్పందించని ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నించారు. జనవాణి ద్వారా బాధితులకు పవన్ అండగా నిలుస్తున్నారన్నారు. ఈనెల 12,13,14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో లోపాలు, అక్రమాలు, అవినీతి బయట పెట్టేందుకు కాలనీలను సందర్శిస్తామన్నారు. సోషల్ ఆడిట్ చేస్తామన్నారు.
రేపు ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్
ఇప్పటం గ్రామంలో కూల్చివేతలపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకు కక్షసాధింపు చర్యగా ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ఇప్పటం గ్రామాన్ని సందర్శిస్తారని తెలిపారు. ఈ రోజు రాత్రికి మంగళగిరి చేరుకొని రేపు ఉదయం ఇప్పటం ప్రజలను కలుస్తారన్నారు. పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లను కూలుస్తున్నారని ఆరోపించారు.
కొనసాగుతున్న ఇళ్ల కూల్చివేత
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారని వైసీపీ నేతలు కక్ష సాధిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇళ్లు కూల్చివేత ప్రారంభించారు. దాదాపు 100 ఇళ్లు కూల్చివేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ఇళ్లు జనసేన మద్దతుదారులవి అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటం గ్రామం జనసేన ఇన్ ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. గ్రామస్థులు జనసేనకు మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఇప్పటం గ్రామానికి హెచ్చరికలు వచ్చాయని ఆరోపించారు.