Kandula Durgesh : దిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడేందుకే ప్రధాని మోదీ పర్యటనలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హడావుడి చేస్తున్నారని జనసేన నేత కందుల దుర్గేష్ ఆరోపించారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. బీజేపీ మిత్రపక్షంగా జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి 8.30 ప్రధానిని కలుస్తున్నారన్నారు. బీజేపీ సభకు జనం తరలించి, విజయవంతం చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతితో విజయసాయి రెడ్డి కుటుంబం బతికేస్తుందన్నారు. మద్యం కుంభకోణంలో శరత్ చంద్రా రెడ్డి అరెస్టుతో విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికీ సబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దలందరూ అవినీతిలో కూరుకుపోయారని కందుల దుర్గేష్ ఆరోపించారు.
ముంపు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు
విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి మద్యం స్కామ్ తో సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కందుల దుర్గేష్ ఆరోపించారు. కొడాలి నానికి పార్టీ జెండాలు మార్చడం సహజమే అన్నారు. జనసేనను విమర్శించే స్థాయి కొడాలి నానికి లేదన్నారు. జగనన్న ఇళ్ల కాలనీలలో సోషల్ ఆడిట్ ఈనెల 12,13,14 తేదీలలో నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రిలో లబ్దిదారులకు టిడ్కో గృహాలు ఇప్పటి వరకూ అందించలేదన్నారు. ముంపు ప్రాంతమైన ఆవలో ఇళ్ల స్థలాల సేకరణ చేసి పది లక్షల భూమికి యాభై లక్షల ప్రభుత్వ సొమ్ము చెల్లించి మోసాలకు పాల్పడ్డారన్నారు.
అవినీతి కుటుంబం
"విజయసాయి రెడ్డి కుటుంబం అవినీతిలో బతికేస్తుంది. మనీలాండరింగ్ కేసులో విజయసాయి రెడ్డిపై ఈడీ కేసులు ఉన్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు అయిన శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడి అన్న గారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం బ్రాండ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఆదాన్ డిస్టిలేరిస్ నుంచి వచ్చాయి. ఇది 2019లో మొదలైంది. ఎటువంటి అనుభవంలేకపోయినా ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందులో ప్రధాన భాగస్వామి రోహిత్ రెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు. ఈ ఆదాన్ సంస్థ తయారు చేసిన మద్యం మాత్రమే కొనుకోవాలని అన్న మాట విన్నాం. రోహిత్ రెడ్డి అన్న శరత్ చంద్రా రెడ్డి దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలందరూ ఏదొక స్కామ్ లోనే ఉన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తన తీరు మార్చుకుని నీతిగా ప్రభుత్వం నడపాలి."- కందుల దుర్గేష్, జనసేన అధికార ప్రతినిధి
కొడాలి నానికి సవాల్
సీఎం జగన్ కు బయటకు వచ్చే అలవాటు తప్పిపోయిందని కందుల దుర్గేష్ ఆరోపించారు. ఒకవేళ సీఎం జగన్ బయటకు వస్తే వ్యాపారులకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఇవాళ గుంటూరులో సీఎం పర్యటన సందర్భంగా నిన్నటి నుంచే షాపుల ముందు బ్యారికేడ్లు పెట్టి వ్యాపారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 2024 తర్వాత జనసేన జెండా ఎత్తివేస్తుందని కొడాలి నాని విమర్శించారని, జెండాలు మార్చే అలవాటు కొడాలి నానికే చెల్లుతుందన్నారు. భూత వైద్యుడిగా కనిపించే కొడాలి నాని చిలక జోస్యం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని ఓ సవాల్ చేస్తున్నానని కందుల దుర్గేష్ అన్నారు. 2024లో వేరే పార్టీ అధికారంలోకి వస్తే కొడాలి నాని పార్టీ మారకుండా వైసీపీలోనే ఉంటానని ప్రమాణం చేయగలరా అని నిలదీశారు.