Kiran Rijiju In AP: ఆక్వా రంగ ఎగుమతులే జీడీపీ ఎదుగుదలలో అత్యంత కీలకమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్యసంపద అపారంగా ఉందని అన్నారు.


ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పర్యటన..
కేంద్ర భూ విజ్ఞానశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సముద్ర తీరంలో చేపట్టాల్సిన పలు ప్రతిపాదనలపై ఇరువురు చర్చించారు. మచిలీపట్టణంలోని సముద్ర తీర ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరిశీలించారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులతో ఆయన సమావేశం అయ్యారు. వారికి కావాల్సిన మౌళిక సదుపాయాలు, లభ్యం అవుతున్న మత్స్య సంపదను గురించి వాకబు చేశారు.


బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో...
రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  వేటుకూరి సూర్యనారాయణరాజు,  పివిఎన్ మాధవ్ లు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నాయకులతో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్దితులు, అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలు, బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను గురించి రాష్ట్ర నాయకత్వం వివరించింది.


సముద్ర తీరం కేంద్రంగా కార్యకలాపాలు...
దేశ వ్యాప్తంగా ఉన్న 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కేంద్రంగా చేసుకొని పలు ప్రతిపాదనలను సిద్దం చేశామని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఇండియా జీడీపీ ప్రపంచంలోనే అయిదవ స్థానంలో ఉందని, ప్రపంచంలోనే మూడవ స్థానానికి చేరుకోవాలని ప్రధాని‌ నరేంద్ర మోదీ ఆలోచనగా తెలిపారు. ఆక్వా రంగ ఎగుమతులే జీడీపీ ఎదుగుదలలో అత్యంత కీలకంగా ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్యసంపద అపారమని, ఈ క్రమంలో తాను సైతం ఆంధ్రప్రదేశ్ ను కేంద్రంగా చేసుకొని పర్యటనలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.


మత్స్యకారులకు అధునాతన టెక్నాలజీ...
మత్స్యకారులకి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని కేంద్ర మంత్రి  కిరణ్‌ రిజిజు  వెల్లడించారు.  మత్స్యకారులకి అత్యాధునిక పరికరాలు అందిస్తామని, సముద్రంలో వేటలో ఉండగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు,  ఇతర వాతావరణ సమస్యలు ధీటుగా  ఎదుర్కునే విధంగా  మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామన్నారు. సకాలంలో వారికి సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  టెక్నాలజీ సహకారంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లినపుడు మత్స్య సంపద ఎక్కడ ఎక్కువగా ఉంటుందనేది ముందుగానే తెలియ చేసే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. 


ఆక్వాలో ఏపీ టాప్...
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో దేశంలోనే ముందంజులో ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ఆక్వా సాగు పై మరింత సానుకూల పరిస్దితులు తీసుకువచ్చేందుకు అవసరం అయిన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా మరింత అభివృద్ధి ని సాధించగలమని అన్నారు. ఇప్పటికే ఆక్వా రంగంలో ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాతావరణ పరిస్దితులు కూడ ఆక్వా రంగానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 
Also Read: Sajjala News: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ, షర్మిలపైనా కీలక వ్యాఖ్యలు