Duvvada Vani Versus Madhuri: శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) దువ్వాడ ఫ్యామిలీ (Duvvada Family) వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ఇల్లు నాదంటే నాదంటూ దువ్వాడ వాణి, దివ్వెల మాధురి పోటాపోటీగా వీడియోలు విడుదల చేశారు. ఈ క్రమంలో టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత నెల రోజులుగా దువ్వాడ ఇంటి వద్దే ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు నిరసన తెలుపుతున్నారు. తమను ఇంట్లోకి అనుమతించాలని పట్టుబడుతున్నారు. అయితే, శనివారం శ్రీనివాస్ ఇంటిపైన మాధురి ప్రత్యక్షం కాగా వాణి, ఆమె కుమార్తె, బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. తమను ఇంట్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాణి బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇలా జరుగుతున్న క్రమంలోనే మాధురి పై నుంచి ఈ తతంగాన్ని వీడియో తీశారు. అనంతరం ఇంటికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు.


'ఆ ఇల్లు నాదే'


అయితే, వివాదాస్పదంగా మారిన ఇల్లు తనదే అని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. 'ఈ బిల్డింగ్ నా పేరు మీదే ఉంది. నా ఇంట్లోకి ఎవరూ రావడానికి వీల్లేదు. అంతేకాదు.. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా ఇష్యూ ఉంటే బయటనే తేల్చుకోవాలి. ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను. పోలీసులు నాకు రక్షణ కల్పించాలి. గతంలో నేను దువ్వాడ శ్రీనివాస్‌కు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాను. నా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన్ను అడిగాను. కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేనంటూ శ్రీనివాస్ నాకు బిల్డింగ్ రాసిచ్చారు. సెల్ఫ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అమ్ముకోవచ్చు.' అని దివ్వెల మాధురి వీడియోలో వివరించారు. 


ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్‌కు మరో రూ.50 లక్షలు ఇచ్చినట్లు మాధురి వెల్లడించారు. గతంలో ఓ ఇంటిని సొంతం చేసుకున్న దువ్వాడ వాణి.. కొత్త ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవాలని చూశారు. దీంతో శ్రీనివాస్‌ను అడగ్గా.. ఆయన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని కొత్త ఇంటిని నా పేరున రాస్తానని చెప్పి శుక్రవారం ఉదయం 11 గంటలకు తన పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. తాను దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో లేనని.. తన ఇంటికే వచ్చి దువ్వాడ వాణి, ఆమె పిల్లలు వచ్చి ఆందోళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి కరెంట్ కట్ చేశారని.. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అన్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వీడియోలో విజ్ఞప్తి చేశారు.


'ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు'


అయితే, దీనిపై దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ప్రవేశానికి తనకు కోర్టు అనుమతి ఉందని.. ఆ ఆదేశాలు ఉండగా మాధురి చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదని చెప్పారు. తన ఆస్తి ఐదున్నర ఎకరాలు అమ్మి ఆ ఇల్లు కొన్నామని.. ప్రాణం పోయినా ఆ ఇల్లు విడిచిపెట్టమని స్పష్టం చేశారు. అటు, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని.. వారి సహకారంతోనే ఆ ఇంట్లోకి అడుగు పెడతానని అన్నారు. తన భర్త తనను మోసం చేస్తారని అనుకోవడం లేదని.. పిల్లల కోసం ఒక ఇంట్లోనే ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.


Also Read: Crime News: పండుగ పూట తీవ్ర విషాదం - వినాయక మండపాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి