Young Men Died Due To Current Shock In AP And Telangana: పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తోన్న క్రమంలో కరెంట్ షాక్‌తో ఏపీ (AP), తెలంగాణలోని (Telangana) వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో (Rayachoti) వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా మహేశ్ (13) అనే బాలుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక టీవీఎస్ షోరూం వెనుక వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుని మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అటు, పల్నాడు జిల్లా ముప్పాళ్లలో వినాయక విగ్రహం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
తిరుమలలో గుండెపోటుతో..
మరోవైపు, తిరుమల క్యూ లైన్‌లో గుండెపోటుతో ఓ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లో శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది. సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలగా తోటి భక్తులు, డిస్పెన్సరీ నర్సులు సీపీఆర్ చేశారు. ఈ క్రమంలో ఆమెను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలిని కడప జిల్లా వాసి ఝాన్సీ (32)గా గుర్తించారు. ఆమెకు కవల పిల్లలున్నారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. అటు, రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లో వైద్యునితో పాటు అత్యవసర వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలంగాణలోనూ ఇద్దరు మృతి
తెలంగాణలోనూ (Telangana) వినాయక మండపాలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రమాదానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్ (28) శుక్రవారం రాత్రి వినాయక మండపానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. గత వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో ముందు జాగ్రత్తగా మండపం పైనుంచి వర్షం నీరు కిందకు రాకుండా టార్పాలిన్‌తో కడగడం మొదలుపెట్టాడు. ఓ చేత్తో ఐరన్ బైండింగ్ వైర్ పట్టుకుని మరో చేత్తో మండపం పైకి విసిరాడు. ఈ క్రమంలో ఆ వైర్ విద్యుత్ తీగలకు తగిలి నవీన్ షాక్‌తో కింద పడి స్పాట్‌లోనే మృతి చెందాడు. నవీన్ కింద పడడం చూసిన మరో వ్యక్తి కర్రతో అతన్ని తప్పించే ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. నవీన్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అటు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సీర్సపల్లిలో ఓ ఇంటర్ విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానిక వినాయక మండపం వద్ద విద్యుత్ బల్బులు సరి చేస్తూ యశ్వంత్ అనే యువకుడు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. యువకుని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.