DSP Sunil Transfer :  ఏపీలోని అనకాపల్లి డీఎస్పీ బి. సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంచార్జీ డీఎస్పీగా మల్ల మహేష్ ను నియమించారు. గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడికి చెందిన వాహనాన్ని (కారు) సొంతానికి వాడుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కారు నెంబర్ ప్లేట్ మార్చి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు విశాఖ బీచ్‌కు వెళ్లటం విమర్శలకు దారి తీస్తుంది. విశాఖ బీచ్‌లో మరో వాహనాన్ని డీఎస్పీ తీసుకెళ్లిన కారు ఢీ కొట్టడంటో ఈ వ్యవహారం బయటపడింది. సీజ్ చేసిన వాహనాన్ని సొంతానికి వాడుకుంటున్నారు.                   


జి.మాడుగులకు చెందిన సుల్తాన్‌ అజారుద్దీన్‌ పేరుతో సీజ్ చేసిన కారు రిజిస్టరై ఉంది. రాజస్థాన్‌కు చెందిన సింగ్‌ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది.ఈకేసు విచారణ కోసం గతేడాది నవంబర్‌లో సింగ్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిచారు. అతడు మరో కారులో స్టేషన్‌కు వచ్చి పోలుసుల ఎదుట హాజరయ్యాడు. విచారణలో అతడు నేరం చేసినట్లు నిరూపితం కావటంతో అతడిని వెంటనే అరెస్టు చేశారు. అయితే తాను స్టేషన్‌కు వేసుకొచ్చిన కారును తన తల్లికి అప్పగించాలని పోలీసులను సింగ్ కోరాడు. కానీ పోలీసులు ఇవ్వలేదు. నెంబర్ ప్లేట్ మార్చి వాడుకుంటున్నారు. 


ఈ నెల 1న అనకాపల్లి డీఎస్పీ సునీల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారు తీసుకుని  విహారానికి  విశాఖపట్నం వెళ్లారు. బీచ్‌ రోడ్డులో డీఎఎస్పీ తీసుకెళ్లిన కారు మరో వాహనాన్ని ఢీకొట్టారు.   అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చ కెక్కింది. ఈ ఘటనపై అనకాపల్లి ఎస్పీ గౌతమి విచారణ జరిపారు.  డీఎస్పీ సునీల్‌ గంజాయితో పట్టుబడిన నిందితుడు సింగ్‌ కారులో ప్రయాణించినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే.. నంబరు ప్లేట్‌ మార్చడం మరో నేరంగా భావించి విచారణకు ఆదేశించారు. తప్పు చేసినట్లుగా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో ఆయనపై బదిలీ వేటు వేశారు.                           


డీఎస్పీ సునీల్ వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది.ఓ రాష్ట్ర మంత్రి అండదండలతో ఆయన అనకాపల్లిలో పోస్టింగ్ పొందారని.. ఆయన అండ ఉందనిచెప్పి రాజకీయ వేధింపులకు కూడా పాల్పడేవారని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఇలా పోలీసులు వినియోగించడం.. అందు కోసం ఏకంగా నెంబర్ ప్లేట్లను మార్చడం.. తీవ్రమైన నేరంగా భావిస్తున్నారు. అయితే పోలీసులు సునీల్ పై కేవలం బదిలీ వేటు వేసి సరి పెట్టారు. కేసులు పెట్టడం.. సస్పెండ్ చేయడం వంటివి చేయకపోవడానికి కారణం ఆయనకు ఉన్న రాజకీయ మద్దతేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.