DSC 2025 Teachers Rally in Vijayawada | ఏపీలో మెగా డీఎస్సీపై అధికార కూటమి పార్టీలు, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పారదర్శకంగా టీచర్ పోస్టులను భర్తీ చేశామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులు చెబుతున్నారు. కానీ మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని.. టీచర్ పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎప్పటికప్పుడూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ 2025 విజేతలు ప్రభుత్వానికి మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, పారదర్శకంగా రిక్రూట్‌మెంట్ జరిగిందని వైఎస్ జగన్ వీరాభిమాని చెప్పడం హాట్ టాపిక్ అయింది.

Continues below advertisement

 డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ, వారి ఆరోపణలకు వ్యతిరేకంగా విజయవాడ నగరంలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ ఆదివారం (ఆగస్టు 16న) నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన స్వరాజ్ మైదాన్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. తమది ప్రతిభ ఆధారంగా సాధించిన ఏపీ మెగా డీఎస్సీ అని, పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేస్తూ టీచర్లు నినాదాలతో హోరెత్తించారు.  

Continues below advertisement

వైఎస్సార్సీపీ నేతలు తమ ప్రతిభను కించపరిచేలా బురదచల్లడం మానుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పాఠాలతో పాటు రాజకీయ గుణపాఠాలు కూడా చెబుతామని ప్లకార్డులు పట్టుకుని హెచ్చరించారు. అహర్నిషలు శ్రమించి, ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన తమపై విషప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని తమ నిరసన తెలిపారు.

 

వైఎస్ జగన్ అభిమానిగా చెబుతున్నా.. ఎలాంటి అక్రమాలు జరగలేదుఓ అభ్యర్థి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో తాను స్కూల్ అసిస్టెంట్ గా సెలక్ట్ అయ్యానని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి వైఎస్ జగన్ వీరాభిమానినని, వాట్సాప్ డీపీ కూడా జగన్ ఫొటోనే ఉంటుందన్నారు. తాను టీడీపీ కార్యకర్త, అభిమానిని కాదని.. ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకుంటే మా ఉద్యోగాలను అవమానించారు. కనుక ఈరోజు నుంచి నేను జగన్ అభిమానిని కాదని పేర్కొన్నారు. 

ఓ అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజమైపోతుందని అంతా నమ్ముతారు. కానీ వైసీపీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని డీఎస్సీ 2025 విజేతలు అన్నారు. ఇది దగా డీఎస్సీ కాదని, మెగా డీఎస్సీ అని.. ఎంతో శ్రమించి తెచ్చుకున్న జాబ్స్ అని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్లలో తిని కడుపు నింపుకుని ప్రిపేర్ అయి టీచర్ జాబ్ తెచ్చుకున్నానని ఓ అభ్యర్థి తెలిపారు. వైసీపీ హయాంలో నోటిఫికేషన్లు రాలేదని, కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా పోస్టులను భర్తీ చేశారని పేర్కొన్నారు. భార్యా పిల్లల్ని దూరం చేసుకుని మరీ చదువుకుని ఉద్యోగాలు సాధించిన మమ్మల్ని అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.