What is dry yeast  : బ్రెజిల్ నుంచి దిగుమలు చేసుకున్న డ్రైఈస్ట్ అనే పదార్థం మాటున పెద్ద ఎత్తున కొకైన్ తరలించారని సీబీఐ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అసలు ఈ డ్రైఈస్ట్ అంటే ఏమిటి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. డ్రై ఈస్ట్ అంటే సింపుల్‌గా చెత్త అని అర్థం. చెత్తను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకోవాలా అంటే.. అక్కడే ఉంది అసలు గుట్టు. 


డ్రైఈస్ట్ అంటే చెత్త


డ్రై ఈస్ట్ పదార్థం అంటే మిగిలిపోయిన చెత్త.   ఓ వ్యర్థ పదార్థంలో ఉత్పత్తి. కుళ్లిన తియ్యని పండ్లు, ఆహార పదార్ధాల నుంచి డ్రైఈస్ట్ తయారవుతుంది. యూరప్ కంట్రీల్లో మిగిలిన ఆహార పదార్థాలను ఉచితంగా ఇచ్చేస్తారు. ఈ పదార్ధాల నుంచి డ్రైఈస్ట్ తయారు చేసిన కంపెనీలు చాలా చౌకగా విక్రయిస్తాయి. దీంతో ఐరోపా దేశాల నుంచి డ్రైఈస్ట్ ను    భారతీయ కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి. ఎందుకంటే… పశువుల మేతకు, చేపలు, రొయ్యల మేతకు డ్రైఈస్ట్ ను    ఉపయోగిస్తారు. ఈ డ్రైఈస్ట్‌లో   ప్రొటీన్లు, సీ విటమిన్లు, భాస్వరం, అమినో ఆమ్లాలు ఉంటాయి. అంతే కాదు, డ్రైఈస్టును ఆల్కాహాల్ తయారీలోనూ వినియోగిస్తారు. అంటే బేవరేజెస్ కూడా డ్రైఈస్ట్ కోసం క్యూకడతాయన్న మాట.


ఇంతకీ విశాఖలో దొరికిన డ్రైఈస్ట్ సంగతేంటీ?


బ్రెజిల్ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఈ డ్రైఈస్ట్ ఏపీలో వినియోగం ఎక్కువ. సాధారణంగా ఆక్వాకల్చర్‌లో  వినియోగం కావటంతో.. డ్రైఈస్ట్ దిగుమతిపై అంతగా నిఘా ఉండదు. వ్యవసాయ రంగంలో అనుబంధ పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తి కావటంతో దేశీయ నిఘా వ్యవస్థ పట్టించుకోలేదు. ఇంటర్ పోల్ నిఘాలో డ్రైఈస్ట్ ముసుగులో డ్రగ్స్ రవాణ కథ వెలుగు చూడటంతో యావత్ భారత దేశం కంగుతింది.  ఇన్ యాక్టివ్ డ్రైఈస్ట్ ను దిగుమతి చేసిన సంధ్యా ఎక్స్ పోర్టర్స్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది.   దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు చేశారు. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి ఫోరెన్సిక్‌ బృందం పరిశ్రమకు చేరుకుంది. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తరలించినట్లు సమాచారం.


మొదటి సారి దిగుమతి  చేసుకుంటున్నామన్న సంధ్యా ఎక్స్ పోర్ట్స్ 


ఈ ఘటనపై కంపెనీ వివరణ ఇచ్చింది. తామ డ్రైఈస్ట్ కు మాత్రమే ఆర్డర్ పెట్టామన్నారు.  ఇటీవల తాము ఓ కొత్త ప్లాంట్ ను ప్రారంభించారు. ఆ ప్లాంట్ లో రొయ్యల మేతను ఉత్పత్తి చేయాలనుకున్నామన్నారు. అందుకే మొదటే.. మొత్తం చెల్లించి.. డ్రైఈస్ట్ ను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. తమకేమీ తెలియదని. సీబీఐ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని అంటున్నారు.