AP Weather Updates: భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న కారణంగా గత 30 సంవత్సరాలుగా సముద్రపు వేడిగాలులు అధికమయ్యాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. దాంతో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఏపీలోని కోస్తాంధ్రలో వాతావరణం కాస్త వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. కళింగపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. నందిగామ, తుని, బాపట్ల, అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చలి ప్రభావం ఒకట్రెండు రోజుల్లో తగ్గనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఆంక్షలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేడి గాలు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. కొన్ని రోజుల కిందటి వరకు విశాఖ ఏజెన్సీ ఏరియాల కన్నా తక్కువ రాత్రిపూట ఉష్ణోగ్రతలు సీమలో నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో, అనంతపురం, నంద్యాల, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.
తెలంగాణలో తగ్గుతున్న చలి
తెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో కనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల వరకు నమోదయ్యేవి. నిన్న కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల మేర నమోదైంది.