Doctor Saves Boy Life With CPR In Vijayawada: 'వైద్యో నారాయణ హరి'.. అంటే వైద్యులు దేవునితో సమానం అంటారు. రహదారిపై కరెంట్ షాక్ తో కుప్పకూలిన తమ బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. కదలకుండా పడి ఉన్న బిడ్డను ఎత్తుకుని కన్నీటితో ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు విషయం తెలుసుకుని ఆ బాలుడికి ఊపిరి పోసేందుకు యత్నించారు. రహదారిపైనే సీపీఆర్ చేసి.. బాలుడు ఊపిరి తీసుకునేలా చేశారు. అనంతరం వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడి పూర్తిగా కోలుకున్నాడు. సకాలంలో సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విజయవాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే.?
విజయవాడ (Vijayawada) అయ్యప్పనగర్ కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి (6) ఈ నెల 5వ తేదీన సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని భుజంపై ఎత్తుకుని కన్నీటితో ఆస్పత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మెడ్ సీ ఆస్పత్రి ప్రసూతి వైద్య నిపుణురాలు నన్నపనేని రవళి అటుగా వస్తూ వారిని చూశారు. విషయం తెలుసుకుని.. బాలుడిని పరీక్షించి రహదారిపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం అక్కడే బాలుడికి సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేశారు. ఓ వైపు బాలుడి ఛాతిపై ఒత్తుతూ.. అక్కడున్న మరో వ్యక్తిని బాలుడికి నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక.. బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే బాలున్ని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి బైక్ పై తరలించారు. ఆస్పత్రికి వెళ్లే మార్గంలో బాలుడికి సరిగ్గా శ్వాస అందేలా.. తలను కొద్దిగా కిందకు ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు.
పూర్తిగా కోలుకున్న బాలుడు
బాలున్ని ఆస్పత్రికి చేర్చిన వెంటనే చికిత్స ప్రారంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటల వైద్యుల పర్యవేక్షణలో ఉంచి.. తలకు సీటీ స్కాన్ చేశారు. ఎలాంటి సమస్య లేదని గుర్తించి.. అనంతరం బాలున్ని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కాగా, వైద్యురాలు రవళి బాలుడికి సీపీఆర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో వైద్యురాలిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.