Gonuguntla Suryanarayana: ధర్మవరం: నియోజకవర్గంలో దాదాపు గత ఐదేళ్లుగా అభివృద్ధి అన్నది అడ్రస్ లేకుండా పోయిందని, భూములు, ఇల్లు, స్థలాల కబ్జాలు మాత్రం ఫుల్ గా జరిగిపోయాయని ధర్మవరం (Dhramavaram) మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ విమర్శించారు. ధర్మవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, రౌడీయిజం, స్థానిక ఎమ్మెల్యే అడ్డగోలు దోపిడి తదితర అంశాలపై కేతిరెడ్డిని ఎండగట్టారు. 2014-19 తెలుగుదేశం (TDP) పాలనలో ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చామన్నారు. నేటి వైసిపి పాలనలో అభివృద్ధి అనేది లేకపోగా ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా కబ్జా చేయడానికే వారికి సమయం సరిపోయిందన్నారు.
ధర్మవరాన్ని దౌర్జన్యాలకు కేంద్రంగా మార్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి
ప్రశాంతంగా ఉన్న ధర్మవరం నియోజకవర్గాన్ని అరాచకాలకు,  దౌర్జన్యాలకు అడ్డాగా మార్చిన ఘనత ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికే దక్కుతుందన్నారు. తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో ధర్మవరం నియోజకవర్గం లో 3400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నేటి వైసిపి పాలనలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం ప్రజల రక్తాన్ని పీల్చి నాలుగు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే సిట్ ఏర్పాటు చేసి కబ్జా చేసిన భూములను అన్నింటిని స్వాధీనం చేసుకొని ప్రజల పరం చేస్తామని హామీ ఇచ్చారు. 
గుడ్ మార్నింగ్ కాదు.. కబ్జా మార్నింగ్..
గుడ్ మార్నింగ్ ను ఎమ్మెల్యే కేతిరెడ్డి కబ్జా మార్నింగ్ గా మార్చాడని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. ధర్మవరంలో కొత్త ఇల్లు నిర్మాణం, స్థలాల రిజిస్ట్రేషన్, వాహనాలు కొనుగోలు చేసినా ఆయనకు కప్పం కట్టాల్సి రావడం దురదృష్టకరమన్నారు. తన గెలుపునకు కృషి చేయడంతో పాటు, పదివేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు కేతిరెడ్డి గెలుపుకు వైసిపి కార్యకర్తలు ఖర్చు చేశారని ఆరోపించారు. అలాంటి కార్యకర్తలను పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో కేతిరెడ్డిని వైసీపీ కార్యకర్తలే చిత్తుచిత్తుగా ఓడించేందుకు తనకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. పలువురు కౌన్సిలర్లు సర్పంచులు, ఎంపీటీసీలు తెలుగుదేశం గెలుపుకు కృషి చేస్తామంటూ తనకు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెబుతామని గోనుగుంట్ల ప్రకటించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.


ధర్మవరం ప్రజలకు నాలుగు హామీలు
ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ నాలుగు స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చిన తర్వాతే 2029 లో మళ్లీ ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు వెళతానన్నారు. గతంలో లాగ ధర్మవరాన్ని సస్యశ్యామలం చేసేందుకు హంద్రీనీవా ద్వారా సాగు, తాగు నీటిని తీసుకువస్తానన్నారు. గతంలోనే ఈ కార్యక్రమానికి అప్పటి సీఎం  చంద్రబాబు నాయుడు ద్వారా అంకురార్పణ జరిగిందని, అయితే సకాలంలో పనులు పూర్తి కాలేదన్నారు. వైసిపి అధికారంలోకి రావడంతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పనిని పూర్తి చేస్తానన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత క్లస్టర్ ను ఏర్పాటు చేసి పదివేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తానన్నారు. 2019లో ధర్మవరం నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా.. వైసీపీ అధికారంలోకి రావడంతో అది సాధ్యం కాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వెంటనే కాలేజీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి సోలార్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు.