రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాల ద్వారా పెద్ద ఎత్తున ధర్మ ప్రచార కార్యకమాన్నిచేపట్టనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. మంగళవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ కమిటీ 3వ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో రోజువారీ జరగాల్సిన నిత్య పూజా కార్యక్రమాలన్నీసక్రమంగా జరగాలని ఆ విషయంలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవాలయాలకు చెందిన అనగా సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల ప్రచార రథాల ద్వారా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్నిచేపడు తున్నట్టు చెప్పారు. ప్రజల్లో హిందూ ధర్మ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను, నైతిక విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ ధర్మప్రచార కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
విధంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అంశంపైన పురాణ ఇతిహాసాలకు సంబంధించి చిన్నచిన్నపుస్తకాలను ప్రచురించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా వారిలో హిందూ ధర్మ పరిరక్షణపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. ఈ ప్రచార రథాలు ఆయా గ్రామాలు, పట్టణాల సందర్శనకు సంబంధించిన తేదీలు, సమయాలు ముందుగానే తెలియజేసి వివిధ దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మికవేత్తలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ అధికారులకు సూచించారు. ప్రతి ప్రచార రథానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
విజయవాడలో మహాలక్ష్మీ యజ్ణం..
రాష్ట్ర శ్రేయోభివృద్ధే లక్ష్యంగా అనగా సంపద,రక్షణ,శక్తి పెంపొందాలనే ఆశయంతో విజయవాడలో లక్ష్మీ సుదర్శన రాజశ్యామల సుదర్శన సహిత మహాలక్ష్మీ యజ్ణాన్ని నిర్వహించాలని సంకల్పించామని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో పాల్గొన్న ఆగమ, జ్యోతిష్య పండితుల నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. వీడియా లింక్ ద్వారా పెద్ద జియంగార్ పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతితోపాటు టిటిడి ఇఓ ధర్మారెడ్డి పాల్గొని ఈ యజ్ణం నిర్వహణకు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. ఈయజ్ణం నిర్వహణకు సంబంధించిన తేది, ముహూర్తం తదితర ఏర్పాట్లపై దేవాదాయశాఖతోపాటు సంబంధిత శాఖల సమన్వయం తో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
అర్చకులకు శిక్షణ....
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార కార్యక్రమం, త్వరలో నిర్వహించనున్నయజ్ణం నిర్వహణకు సంబంధించి పలు సూచనలు, సలహాలను అందించారు. ధార్మిక పరిషత్ సమావేశంలో అర్చకులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, వివిధ ట్రస్ట్ బోర్డుల సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు, కారుణ్య నియామకంలో చేరిన వారికి తగిన శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలపై సమీక్షించారు. దేవాదాయ శాఖ పరిదిలో ఉన్న సమస్యలపై కూడా త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించటం ద్వార, ఆధ్యాత్మిక వేత్తలు, స్వామీజిల సలహాలతో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహింటానికి అవసరం అయిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.