Dhanunjay Reddy and Krishnamohan Reddy Arrested : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మాజీ అధికారులరు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సీఐడీ సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఉదయం వీరిద్దరికీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. వారికి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. వీరిద్దరికీ మాత్రం ఇప్పటి వరకూ రిలీఫ్ ఉంది.
మూడో రోజు విచారణకు హాజరైన సమయంలో సుప్రీంకోర్టు షాక్ - అరెస్టు ఖాయమని అప్పుడే సంకేతాలు
రెండు రోజుల నుంచి విచారణకు హాజరు అవుతున్నారు. ప్రస్తుతం బెయిల్ ఇస్తే.. విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే.. దిగువ కోర్టులు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో సుప్రీంకోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. రెండు రోజుల నుంచి వీరిద్దరూ విచారణకు హాజరవుతున్నారు ఈ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. వారిని విచారణ తర్వాత అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు. న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోవడంతో అరెస్టు కావడం ఖాయమని వారికి అర్థమయింది. ఈకేసులో ఈడీ కూడా ఎ 1 నిందితుడు అయిన రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరింది. కోర్టు అనుమతి ఇచ్చింది.
మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ధనుంజయ్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు సీఎంవోను ఒంటి చేత్తో నడిపించారు. కృష్ణమోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారు. వీరిద్దరూ తమ కుటుంబసభ్యుల పేర్లతో కంపెనీలు పెట్టి మద్యం సొమ్మును చెలామణిలోకి తీసుకు వచ్చారని ఏపీ సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. డబ్బుల తరలింపులో వీరిది కీలక పాత్ర అని చెబుతున్నారు. వీరిద్దరినీ అరెస్టు చేసి కస్టడీకి తీసుకుంటే.. చెప్పే వివరాలు మాజీ సీఎం జగన్ కు ఇబ్బందికరంగా మారుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
విజయసాయిరెడ్డి వాంగ్మూలమే కీలకం !
గతంలో విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంపై జరిగిన సమావేశాలకు వీరిద్దరూ హాజరయ్యారని మీడియా ముందు చెప్పారు. సీఐడీ అధికారులకు కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ధనుంజయ్ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి. వైసీపీ ఓడిపోయే ముందు రోజునే ఆయన పదవి కాలం పూర్తి అయింది. ఐఏఎస్ గా చేసి మద్యం స్కాంలో జైలుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీరి అరెస్టులో విజయసాయిరెడ్డి వాంగ్మూలం కీలకంగా మారినట్లుగా భావిస్తున్నారు.