Supreme Court Two Judge bench omments :  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో  టీడీపీ  అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.  అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తున్నామని తెలిపారు. 


చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు 


చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు చట్టవిరుద్దని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ప్రకటించారు.   చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారు ..కేసుల నమోదుకు ముందు సీఐడీ తగిన అనుమతి తీసుకొని ఉండాల్సిందని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు. సెక్షన్‌ 17-ఎ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని.. లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది. ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.  ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)సీ, డీ, 13(2) ప్రకారం విచారణ చేయడం తగదని స్పష్టం చేశారు.  అయితే రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయడం కుదరదని..  ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేమన్నారు.  ఈ పరిస్థితుల్లో పిటిషన్‌ను డిస్పోస్ చేస్తున్నానని తెలిపారు. 


చట్టసవరణ తర్వాత కేసులకే 17ఏ వర్తిస్తుందన్న జస్టిస్‌ త్రివేది


చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17-ఏ వర్తింపజేయలేమని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు.  2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17(ఏ) ఏ నాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు.  ఈ పరిస్థితుల్లో చట్టం రాక ముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమన్నారు.  ఈ కేసులో సెక్షన్ 17(ఏ)ను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపచేయాలి.2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు నాటి సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలి.  చట్టం రాకముందుకాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుంది. దీన్ని అంగీకరిస్తే అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులన్నీ నిరర్థకం అవుతాయి. ఆ చట్టం మూల ఉద్దేశం దెబ్బతింటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.  అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17(ఏ) మూల ఉద్దేశం కాదని..  ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు, విచారణలు ప్రభావితమవుతాయన్నారు.  ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు.. కేవలం సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్.ఐ.ఆర్ కొట్టేయడానికి కారణం కారాదన్నారు. 


సెక్షన్ 17ఏ వర్తింపుపై తేల్చనున్న విస్తృత ధర్మాసనం


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ పూర్తయిన మూడు నెలలకు తీర్పు వెలువరించారు. ఇప్పుడు సీజేఐ విస్తృత ధర్మాసనంను ఏర్పాటు చేసి 17ఏ వర్తిస్తుందో లేదో తీర్పు చెప్పాల్సి ఉంది.