దేశంలో అవినీతి పోవాలంటే ప్రధాని, సీఎం పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే సీఎం జగన్ తో పోటీ పడిన ఎవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికలంటే తనకు ముందు గుర్తుకొచ్చేది ఇందిరా గాంధీ, ఎన్టీఆరేనని చెప్పారు. డైరెక్ట్ ఎన్నికల ద్వారా అమ్ముడు పోయే రాజకీయాలకు స్వస్తి పలకవచ్చని, అవినీతి కూడా 80 శాతం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల మద్దతుపై స్పందించిన ఆయన, ఆ విషయం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.


అంతకు ముందు ఆయన కుటుంబ సమేతంగా కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 


'చంద్రబాబును ఎవరూ నమ్మరు'


ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని, ఆ విషయం ప్రజలందరికీ తెలుసని నారాయణ స్వామి అన్నారు. ఆయన నీతిమంతుడు అంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఓ ఎస్సీ, ఎస్టీ గానీ గెలవలేదని విమర్శించారు. అంతకు ముందు కూడా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చారని, కంటి పరీక్షల తర్వాత మళ్లీ ఆయన జైలుకే వెళ్తారని పేర్కొన్నారు. దేశంలో అన్ని రోగాల పేరు చెబుతూ, చంద్రబాబు బెయిల్ కోసం డ్రామాలు ఆడుతున్నారని, కళ్లు, లివర్, హార్డ్ పని చేయకుండా ఉండేవారు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని.? మండిపడ్డారు. టీడీపీ నేతలు హమాస్ ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు నిజమా? కాదా? అనేది ఆయన సతీమణి భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు.


చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న సమయంలోనూ నారాయణ స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చంపితే ఆయన సతీమణి నారా భువనేశ్వరియే చంపాలని కామెంట్ చేశారు. 'నారా భువనేశ్వరి పదవీ కాంక్షతో చంద్రబాబుకు పెట్టే అన్నంలో ఏదైనా కలిపి చంపే కార్యక్రమం చేస్తున్నారో.? ఏమో.? నాకు తెలియదు.' పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై భువనేశ్వరి, నారా లోకేశ్ సహా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: వైజాగ్‌లో 8వ ఎడిషన్ నేవీ మారథాన్