Polavaram : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మరో షరతు పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వే(Economic Survey)ను మరోసారి నిర్వహించాలని ఏపీని కోరింది. లోక్‌సభ(Loksabha)లో వైసీపీ ఎంపీలు(Ysrcp MPs) బ్రహ్మానంద రెడ్డి, సత్యవతి, రెడ్డప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ(Central JalSakti) సహాయ మంత్రి బిస్వేస్వర్ టుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌(DPR) తయారు చేయాలన్న నిబంధన విధించినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది. పోలవరం నిర్మాణంలో  రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యతని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14,336 కోట్లు ఖర్చు చేసిందని కేంద్రం పేర్కొంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రూ.12,311 కోట్లు తిరిగి చెల్లించామని కేంద్రం తెలిపింది. తాజాగా రూ.437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జల్‌శక్తి శాఖ వివరించింది. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని కేంద్ర జల్ శక్తి శాఖ రాష్ట్రాన్ని కోరింది. 


2023 నాటికి ప్రాజెక్టు పూర్తి 


పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తిపై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల పునరావాసంలో పురోగతితో పాటు పునరావాస, పునర్నిర్మాణ కాలనీల నిర్మాణ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్‌ 2022-23 కోసం నీటి పారుదల రంగానికి గానూ రూ.11,482 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు.  


ఇటీవల పోలవరంలో కేంద్ర మంత్రి పర్యటన 


కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ( Gajendra Singh Shekavat) ఇటీవల పోలవరంలో( Polavaram ) పర్యటించారు. ఇందుకూరు- 1, తాడ్వాయిల్లో  పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలను కేంద్ర మంత్రి షెకావత్ పరిశీలించారు. పునరావాస కాలనీలు అద్భుతంగా ఉన్నాయని మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు ( CM Jagan ) కృతజ్ఞతలని తెలిపారు.  పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానికే అని కేంద్ర మంత్రి ఇటీవల ఏపీ పర్యటనలో తెలిపారు. తాజాగా కేంద్రం మరో ప్రకటన చేసింది. రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యతని తెలిపింది. దీంతో పోలవరం నిర్మాణం నిర్దేశిత సమయం కన్నా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.