ఏడాది క్రితం వైజాగ్ లో అదృశ్యం అయిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఇన్నాళ్ళకి అనంతపురంలో దొరికాడు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు 2021 మార్చి 20వ తేదీన కనిపించకుండా పోయాడు. ఉద్యోగరీత్యా స్టీల్ ప్లాంట్‌కి వెళ్లిన వ్యక్తి ఆ తరువాత కనిపించకపోవడంతో ఉద్యోగులు , బంధువులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
ఒక్కసారిగా కనిపించకుండా పోయిన శ్రీనివాసరావుపై చాలా స్టోరీలు వినిపించాయి. శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ లో అగ్నికి ఆహుతి అయిపోయాడు అంటూ పుకార్లు చెలరేగాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీనివాస రావు చాలామందిని మోసం చేసాడనే ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నిటినీ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అప్పటి నుంచి శ్రీనివాసరావు కోసం వెదుకుతున్నారు.
చివరకు నమ్మకమైన సోర్సుల ద్వారా అనంతపురంలో ఉంటున్నాడనే సమాచారం రావడంతో అక్కడకు వెళ్లింది పోలీస్ బృందం. అనంతపురంలోని ఆదర్శ్ నగర్‌లో ఉంటున్న శ్రీనివాస రావును గుర్తించి గాజువాక తరలించారు. అసలు శ్రీనివాస రావు అదృశ్యం వెనుక కారణాలేంటి అనే కోణంలో ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు పోలీసులు.
శ్రీనివాస రావు అదృశ్యం వెనుక కారణాలు ఏంటి :
ప్రస్తుతం పోలీసులకి శ్రీనివాసరావు ఇంతవరకూ అజ్ఞాతంలో ఉండడానికి గల కారణాలు ఏంటి అనే అంశం అర్ధం కావడం లేదు. గతంలో విశాఖ నగరంలోని కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని తరువాత మొహం చాటేసాడనే ఆరోపణలు శ్రీనివాసరావుపై ఉన్నాయి. అందుకే ఆయన అజ్ఞాతంలోనికి వెళ్లాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అప్పుల బాధ భరించలేక అనంతపురం చెక్కేశాడేమో అని కూడా విచారణ చేస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏడాది పాటు అజ్ఞాతంలో బతికిన శ్రీనివాసరావు అదృశ్యం వెనుక కారణాలేంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.